రాత్రి వేళ కర్ఫ్యూ ఎత్తివేత..ఆగస్టు 31 వరకూ స్కూళ్లు బంద్

Update: 2020-07-29 14:43 GMT

అన్ లాక్ 3..మార్గదర్శకాలు జారీ

పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలపై నిషేధం ఆగస్టు 31 వరకూ కొనసాగనుంది. ఆన్ లైన్/దూర విద్యను ప్రోత్సహించాలని నిర్ణయించారు. సినిమా హాళ్ళు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్ టైన్ మెంట్ పార్కులు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియాలు, ఇతర సమావేశ మందిరాలపై కూడా నిషేధం కొనసాగనుంది. వీటిని ఎప్పుడు ఓపెన్ చేయాలనే అంశంపై విడివిడిగా నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఆగస్టు 5 నుంచి జిమ్ లు, యోగా సంస్థలను ఓపెన్ చేయనున్నారు. వీటికి సంబంధించి ప్రామాణిక నిర్వహణ విధానాలు (ఎస్ వోపీ) విడిగా జారీ చేయనున్నారు. కేంద్ర హోం శాఖ అనుమతించిన విమానాలు తప్ప..అంతర్జాతీయ విమానయానంపై నిషేధం కొనసాగనుంది. ఆగస్టు 15 వేడుకలను భౌతిక దూరం పాటిస్తూ నిర్వహించాల్సి ఉంటుంది. ఎట్ హోంలపై రాష్ట్రపతి, గవర్నర్ లు నిర్ణయం తీసుకుంటారు.

మైట్రో రైలు సర్వీసులపై కూడా నిషేధం కొనసాగనుంది. సామాజిక, రాజకీయ, క్రీడా, ఎంటర్ టైన్ మెంట్, విద్యా, సాంస్కృతిక సమావేశాలకు సంబంధించిన అంశాలపై తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్రం మూడవ దశ అన్ లాక్ మార్గదర్శలను బుధవారం జారీ చేసింది. రాత్రి వేళల్లో కర్ఫ్యూను ఎత్తేశారు. దీంతో ప్రజలు రాత్రి వేళల్లో కూడా అవసరాన్ని బట్టి ప్రయాణాలు చేయవచ్చు. కంటైన్ మెంట్ జోన్లలో లాక్ డౌన్ ఆగస్టు 31 వరకూ కొనసాగుతుంది. అదే సమయంలో అంతర్ రాష్ట్ర, రాష్ట్రంలో రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. దీనికి ఎలాంటి అనుమతులు అవసరం లేదని తెలిపారు.

Similar News