ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి వ్యంగాస్త్రాలు సంధించారు. గత కొంత కాలంగా చైనాతో తలెత్తిన సరిహద్దు వివాదంపై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్ ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా పలు అంశాలను ప్రస్తావించారు. దేశంలో కరోనా వైరస్ కోరలుచాస్తున్న వేళ ప్రధాని నరేంద్రమోడీ నమస్తే ట్రంప్ ఈవెంట్ నిర్వహణ, మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని కూల్చడం, కరోనా యోధుల కోసం ప్రజలను కొవ్వొత్తులు వెలిగించాలని కోరడం, బీహార్ లో వర్చువల్ ర్యాలీ.
మోడీ సర్కారు ఆరో వార్షికోత్సవం, రాజస్థాన్ లో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర వంటి పనులతో బిజీగా ఉన్నారని..ఇవన్నీ ఆయన విజయాలే అని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలతోనే భారత్ కరోనా వైరస్‌పై పోరాటంలో స్వయం సమృద్ధి సాధించిందని రాహుల్ ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ట్రాంగ్‌మేన్ ఇమేజ్ ఇప్పుడు భారత్‌కు అతిపెద్ద బలహీనతగా మారిందని రాహుల్ సోమవారం పేర్కొన్నారు. కరోనా వైరస్‌పై పోరులో అసత్యాలు, చైనాతో ప్రతిష్టంభనపై వాస్తవాలను కప్పిపుచ్చడం వంటి చర్యలకు భారత్ భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని పేర్కొన్న విషయం తెలిసిందే.