పాచిపోయిన లడ్డూలను కౌగిలించుకున్న పవన్ కు సంకటం!

Update: 2020-07-31 04:55 GMT

ఓ సారి బిజెపి, టీడీపీతో పొత్తు పెట్టుకుని చిక్కుల్లో పడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పుడు మరోసారి బిజెపితో జోడీకట్టి రాజకీయంగా సంకట స్థితిని ఎదుర్కోబోతున్నారు. బిజెపితో పొత్తు పెట్టుకున్నప్పుడే అమరావతి విషయంలో స్పష్టమైన హామీ తీసుకున్నానని..అందుకే ఆ పార్టీ తో చేతులు కలిపానని ప్రకటించారు. అసలు కేంద్రంలో అధికారం చలాయిస్తున్న పార్టీకి రాష్ట్రంలో ఓ వైఖరి. కేంద్రంలో ఓ వైఖరి ఉంటుందా?. రాష్ట్రంలో పోరాటం చేస్తారంట..కేంద్రం మాత్రం జోక్యం చేసుకోదట. ఇది మరోసారి ఏపీ ప్రజలను వంచించటం కాదా?. దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంత పాటడం. ప్రత్యేక హోదా విషయంలో బిజెపి రాష్ట్రానికి ‘పాచిపోయిన లడ్డూలు’ ఇచ్చిందని తీవ్ర విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ‘అమరావతి’ పేరు చెప్పి మరోసారి బిజెపికి దగ్గరయ్యారు. కానీ ఇప్పుడు మళ్ళీ సీన్ రివర్స్ అవుతోంది. అమరావతి నుంచి రాజధాని ఎక్కడకు వెళ్లదని..వెళ్లినా మళ్ళీ తిరిగి వస్తుందని పవన్ కళ్యాణ్ లు ప్రకటనలు చేశారు. వచ్చే మూడేళ్ళలో సీఎం జగన్ వైజాగ్ లో పరిపాలనా రాజధానికి సంబంధించిన భవనాలు పూర్తి చేస్తే అది జరిగే పనేనా?. ఇది రైతులను..ఆ జిల్లాల ప్రజలను మరోసారి వంచించటమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పైగా బిజెపి కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు చాలా స్పష్టంగా కేంద్రం జోక్యం చేసుకోదని మరోసారి స్పష్టం చేశారు.

కేంద్రం జోక్యం చేసుకోకుండా బిజెపి, జనసేనలో ఏపీలో ఉద్యమాలు చేస్తే ఏమి అవుతుంది. అంటే ‘ఉత్తుత్తి ఉద్యమం’ చేస్తారా?. ఓ వైపు కేంద్రం జోక్యం చేసుకోదు అంటూ కుంబబద్దలు కొట్టి తాము అమరావతి వైపే అనటం వెనక మతలబు ఏంటి?. రైతులకు న్యాయం చేయాలనే..తాము వారి తరపున నిలబడతామని చెప్పటం అంటే రాజధాని తరలిపోయినా పర్వాలేదు..రైతులకు నష్టపరిహారమో...ప్యాకేజీనో చెల్లిస్తే సరిపోతుంది అనేది సోము వీర్రాజు వాదనలా ఉంది. మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే బాట పడతారా? ఈ మధ్య మాట్లాడితే మాటకు ముందు..మాటకు వెనక ప్రధాని మోడీని పొగిడే కార్యక్రమం అందుకున్నారు. మరి రాబోయే రోజుల్లోనూ పాచిపోయిన లడ్డూలను కౌగిలించుకుని మందుకు సాగుతారా?. వేచిచూడాల్సిందే.

 

Similar News