తెలంగాణ కొత్త సచివాలయం మోడల్ ఇదే
తెలంగాణ లో కొత్తగా నిర్మించనున్న సమగ్ర సచివాలయం భవన డిజైన్లు ఓకే అయ్యాయి. పైన చిత్రంలో ఉన్న భవనం మోడల్ కు ముఖ్యమంత్రి కెసీఆర్ ఆమోదం తెలిపారు. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ తో పాత సచివాలయం కూల్చివేత పనులు సోమవారం రాత్రి నుంచి ప్రారంభం అయ్యాయి. ఇవి పూర్తికాగానే టెండర్లు పిలిపి పనులు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. అయితే శ్రావణమాసంలో కొత్త సచివాలయం పనులకు శ్రీకారం చుడతారని చెబుతున్నారు. ఇప్పటికే నూతన సచివాలయం పనులకు డీ బ్లాక్ వెనక భాగంలో ముఖ్యమంత్రి కెసీఆర్ శంకుస్థాపన చేశారు.
ఇది చేసి కూడా ఏడాది దాటిపోయింది. హైకోర్టులో కేసు ఉండటం వల్ల ఇంత కాలం పనులు ముందుకు సాగలేదు. ఇటీవలే హైకోర్టు పాత సచివాలయం కూల్చివేతకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే రెడీ అయిన డిజైన్ల దుమ్ముదులిపారు. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించారు.కొత్త సచివాలయం పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలనే యోచనలో తెలంగాణ సర్కారు ఉంది. దీనికి ఏడాది డెడ్ లైన్ గా పెట్టుకున్నట్లు సమాచారం.