భయపడొద్దు...అలాగని నిర్లక్ష్యం వహించొద్దు

Update: 2020-07-17 09:52 GMT

కరోనాపై పోరుకు అదనంగా వంద కోట్లు

కొత్తగా నియమితులైన నర్సులకూ పాత వారితో సమానంగా వేతనాలు

‘కరోనాకు భయపడాల్సిన పనిలేదు. అలాగని ఏ మాత్రం నిర్లక్ష్యం గా ఉండకూడదు. ఆందోళనతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పనిలేదు. ప్రభుత్వంలోనే అందరికీ సేవలు అందిస్తాం. ప్రభుత్వ ఆస్పత్రులు, సిబ్బంది రెడీగా ఉన్నారు. ప్రజలకు వైద్య సేవలు అందించటానికి ఎంత ఖర్చు పెట్టడానికి అయినా రెడీగా ఉన్నాం. తెలంగాణలో వైద్యులు ఎంతో గొప్ప సేవలు అందిస్తున్నారు. వారికి ధన్యవాదాలు’ అని సీఎం కెసీఆర్ వ్యాఖ్యానించారు. ఆరోగ్య శాఖకు బడ్జెట్ కు అదనంగా అత్యవసర అవసరాల కోసం వాడేందుకు వంద కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. శుక్రవారం నాడు నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘జాతీయ సగటుతో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మరణాల రేటు తక్కువగా ఉన్నది. రాష్ట్రంలో రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉన్నది. రాష్ట్రంలో గురువారం నాటికి ఆసుపత్రుల్లో ఉండి చికిత్స పొందుతున్న వారు 3,692 మంది ఉన్నారు.

వారిలో తీవ్రమైన ఇతర జబ్బులున్న 200 మంది తప్ప మిగతా వారంతా కోలుకుంటున్నారు. రాష్ట్రంలో గురువారం నాటికి 41,018 మందికి వైరస్ సోకింది. అందులో 27,295 మంది (67శాతం) కోలుకుని ఇంటికి వెళ్లిపోయారు. మిగతా వారిలో ఎలాంటి లక్షణాలు లేని 9,636 మంది హోం క్వారంటైన్ లో ఉన్నారు. మిగతా వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారంతా వేగంగా కోలుకుంటున్నారు. లక్షణాలు లేనప్పటికీ కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం వైరస్ సోకిన వారందరి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన గైడెన్స్ తో చికిత్స అందిస్తున్నాం. కరోనాతో సహజీవనం చేయాల్సిందే. కరోనాను ఎదుర్కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వమే మొదట గందరగోళంలో ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కావాల్సినవన్నీ చాలా వేగంగా సమకూర్చుకున్నాం. ఇప్పుడు వేటికీ కొరతలేదు. హైదరాబాద్ లోని గాంధీ, టిమ్స్ లోనే దాదాపు 3వేల బెడ్లు ఆక్సిజన్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ సౌకర్యం కలిగిన 5 వేల బెడ్లను సిద్ధం చేశాము. అన్ని ఆసుపత్రుల్లో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల బెడ్లను కేవలం కరోనా కోసమే ప్రత్యేకంగా కేటాయించి పెట్టాము.

ఇన్ని బెడ్లు గతంలో ఎన్నడూ లేవు. 1500 వెంటిలేటర్లు సిద్దంగా ఉన్నాయి. లక్షల సంఖ్యలో పిపిఇ కిట్లు, ఎన్ 95 మాస్కులు సిద్ధంగా ఉన్నాయి. మందులు, ఇతర పరికరాల కొరత లేదు. ప్రభుత్వ వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ఎంతో గొప్పగా సేవలు అందిస్తున్నారు. అవగాహన లేకుండా ఎవరో చేసే చిల్లర మల్లర విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాలి. ప్రజలకు మెరుగైన వైద్యం సమర్థవంతంగా అందించే విషయంపైనే వైద్య సిబ్బంది ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. వైద్య కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు యుజిసి స్కేల్ అమలు చేయాలని నిర్ణయించారు. కొత్తగా నియామకమైన నర్సులకు కూడా పాత వారితో సమానంగా వేతనాలు చెల్లించాలని నిర్ణయించారు.

ఆయుష్ విభాగాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పిజి పూర్తి చేసిన 1200 మంది వైద్యులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పీహెచ్.సి.లలో ఖాళీగా ఉన్న 200 మంది డాక్టర్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సిఎం ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రులు బెడ్ల అందుబాటు విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి. కృత్రిమ కొరత సృష్టిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ప్రతీ ఆసుపత్రి తమ వద్ద ఎన్ని బెడ్లు ఉన్నాయి? అందులో ఎన్ని ఖాళీగా ఉన్నాయి అనే విషయాలను బహిరంగ పరచాలి. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వివరాలు తెలియచేయాలి’ అని కెసీఆర్ ఆదేశించారు.

 

 

Similar News