వైసీపీకే నాలుగు రాజ్యసభ సీట్లు

Update: 2020-06-19 13:39 GMT

ఏపీలో అధికార వైసీపీ నాలుగు రాజ్యసభ సీట్లను గెలుచుకుంది. దీంతో రాజ్యసభలో వైసీపీ బలం ఆరుకు పెరిగింది. ఆ పార్టీ అభ్యర్ధులుగా బరిలో నిలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమళ్ నత్వానీ, అయోధ్య రామిరెడ్డి ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. వాస్తవానికి ఏకగ్రీవం కావాల్సిన ఈ ఎన్నికలు సరైన బలం లేకపోయిన ప్రతిపక్ష టీడీపీ అభ్యర్ధిని బరిలో నిలపటంతో పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. గెలుపొందిన వైసీపీ అభ్యర్ధులు ఒక్కొక్కరికి 38 ఓట్లు వచ్చాయి. వాస్తవానికి వైసీపీకి ఉన్నది 151 మంది ఎమ్మెల్యేలే. అయితే జనసేనకు చెందిన రాపాక వరప్రసాద్ కూడా వైసీపీ అభ్యర్ధికే ఓటు వేశారు. టీడీపీ నుంచి రాజ్యసభ బరిలో నిలిచిన వర్ల రామయ్యకు కేవలం 17 ఓట్లు మాత్రమే వచ్చాయి. టీడీపీ రెబల్స్ ఓట్లు వేసినా కూడా అవి వ్యూహాత్మకంగా చెల్లకుండా చేశారు.

ఇదిలా ఉంటే మంత్రివర్గంలో ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ లు ఇక తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వీరిద్దరూ శాసనమండలి సభ్యులుగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్నిక అనంతరం అధికారులు రాజ్యసభకు ఎన్నికైన అభ్యర్ధులకు సర్టిఫికెట్లు అందజేశారు. రాజ్యసభకు ఎన్నికైన అనంతరం పరిమళ్ నత్వానీ మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్నికల ముందు ఇఛ్చిన హామీలను జగన్ విజయవంతంగా అమలు చేస్తున్నారని అన్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ తనలాంటి వాళ్లను పార్లమెంట్ కు పంపిన ఘనత జగన్ దే అన్నారు.. అసలు తాను పార్లమెంట్ లో అడుగుపెడతానని కలలో కూడా ఊహించలేదన్నారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో మరచిపోలేని రోజు అన్నారు. చిన్న స్థాయి నుంచి వచ్చిన తనకు ఇలాంటి స్థానం వస్తుందని ఊహించలేదు. కోరిక ఉన్నా కూడా నాయకుడి రూపంలో ఇలాంటి అరుదైన అవకాశం లేదన్నారు.

 

Similar News