తెలంగాణలో మళ్ళీ పదవ తరగతి పరీక్షలు వాయిదా

Update: 2020-06-06 15:01 GMT

పదవ తరగతి పరీక్షలకు సంబంధించి తెలంగాణలో శనివారం నాడు నాడు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సోమవారం నుంచి జరగాల్సిన పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీహెచ్ఎంసీ పరిధిలో తప్ప..రాష్ట్రమంతటా పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు ఆదేశించింది. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున పిల్లల ప్రాణాలను రిస్క్ లో పెట్టలేమని..తర్వాత వీరికి సప్లిమెంటరీ పరీక్షలు పెట్టి రెగ్యులర్ విద్యార్ధులుగానే ట్రీట్ చేయాలని హైకోర్టు కోరింది. అయితే మళ్ళీ విడిగా పరీక్షలు పెట్టడం..పేపర్లు సిద్ధం చేయటంలో సమస్యలు వస్తాయని ప్రభుత్వం తరపున కోర్టుకు నివేదించారు. అయితే సాంకేతిక కారణాల కారణంగా విద్యార్ధులను రిస్క్ లోకి నెట్టలేమని..పరీక్షల సమయంలో ఎవరైనా విద్యార్ధి కరోనా కారణంగా మరణిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది.

సర్కారు తీరును తప్పుపట్టింది. జీహెచ్ఎంసీ తప్ప..రాష్ట్రమంతటా పరీక్షలకు ఓకే చెప్పటంతో..సర్కారు ఆలోచించి మొత్తం పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ ప్రకటన చేశారు. త్వరలోనే సీఎం కెసీఆర్ దగ్గర జరిగే సమావేశంలో పరీక్షలు ఎప్పుడు జరపాలనేది నిర్ణయిస్తామని తెలిపారు. కరోనా కారణంగా విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నట్లు సర్కారు హైకోర్టుకు తెలిపింది. అయినా సరే జీహెచ్ఎంసీలో పరీక్షలకు నో చెప్పింది. దీంతో సర్కారు మొత్తం పరీక్షలను వాయిదా వేసింది.

Similar News