జగన్ కూడా బంకర్లు కట్టించుకుంటాడేమో

Update: 2020-06-04 08:23 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అమెరికాలో ప్రజల నిరసనకు భయపడి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా బంకర్లలో దాక్కున్నారని..జగన్ కూడా బంకర్లు కట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. నేర స్వభావం ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తే రాష్ట్రం ఎలా ఉంటుందో జగన్ ఏడాది పాలనే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ తప్పిదాలను న్యాయస్థానాలు తప్పుబడుతుంటే చులకనవుతున్న తీరును పక్కదోవ పట్టించేందుకే వైసీపీ నేతలు తెలుగుదేశాన్ని నిందిస్తున్నారని మండిపడ్డారు.

ప్రతీదానికీ చంద్రబాబు వయస్సు మీద విమర్శలు చేస్తున్నారని..వారికి వయస్సు పెరగదని వైకాపా నేతలు భావిస్తున్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబు వయస్సు గురించి మాట్లాడే అంబటి రాంబాబు ఆయనతో కలిసి తిరుమల కొండ ఎక్కగలరా అని సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకులెందరో ఉన్నారని...వైసీపీ నేతలు విమర్శిస్తున్నట్లుగా లోకేష్‌కి అవినీతిలో అనుభవం లేదని అన్నారు. వాళ్ల మాదిరి సూట్ కేసు కంపెనీలు పెట్టడం, దొంగ సొమ్ము దోచుకోవటం, అక్రమార్జన చేయటంలో జగన్‌లా లోకేష్‌కి అనుభవం లేదని విమర్శించారు.

 

Similar News