వైసీపీలో చేరిన సిద్ధా రాఘవరావు

Update: 2020-06-10 11:32 GMT

తెలుగుదేశం పార్టీకి మరో షాక్. ఊహించినట్లుగానే మాజీ మంత్రి సిద్ధారాఘవరావు జంప్. ప్రకాశం జిల్లాలో టీడీపీలో ప్రముఖ నేతగా ఉన్న సిద్ధా రాఘవరావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి..బుధవారం నాడు అధికార వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో సిద్ధా రాఘవరావు వైసీపీ కండువా కప్పుకున్నారు. సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి సిద్ధాను పార్టీలోకి ఆహ్వానించారు. సిద్ధా రాఘవరావుతోపాటు ఆయన తనయుడు సుధీర్, నియోజకవర్గానికి చెందిన ఇతర కీలక నేతలు కూడా వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వైసీపీలో చేరిన తర్వాత సిద్ధా రాఘవరావు మీడియాతో మాట్లాడుతూ ‘ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరాను. సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏడాది కాలంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు అనేకమంది లబ్ధి పొందుతున్నారు.

భవిష్యత్తులోనూ అనేక సంక్షేమ పథకాలు సీఎం అమలు చేస్తారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకోవాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాకే చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్యే కరణం బలరామ్ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. అధికారికంగా ఆయన టీడీపీలో చేరకపోయినా..ఆయన తనయుడిని దగ్గరుండి వైసీపీలో చేర్పించారు. తాజాగా కూడా చంద్రబాబుపై కరణం బలరామ్ తీవ్ర విమర్శలు చేశారు. అయితే సిద్ధా రాఘవరావు పార్టీ మారటం వెనక రకరకాల ఒత్తిళ్ళు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయనకు ఉన్న మైనింగ్ వ్యాపారానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసుకోవటం కోసమే ఆయన పార్టీని మారినట్లు చెబుతున్నారు.

 

Similar News