ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలు

Update: 2020-06-10 14:47 GMT

కరోనా కారణంగా పలు రాష్ట్రాలు పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్ధులు అందరినీ పాస్ అని ప్రకటిస్తున్నాయి. తాజాగా తెలంగాణ, తమిళనాడు ఇదే బాట పట్టాయి. అయితే ఆంధ్రప్రదేశ్ మాత్రం తాము పరీక్షలు నిర్వహించి తీరుతామని..షెడ్యూల్ ప్రకారమే ముందుకెళతామని ప్రకటించింది. ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలం సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో పరిస్థితులకు మనకు తేడా ఉంది. కరోనా వైరస్‌ నియంత్రణలో దేశంలోనే మన రాష్ట్రం ఆదర్శంగా ఉంది.

విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రత విషయంలో రాజీపడం. టెన్త్‌ పరీక్షలు యథాతథంగా జరుగుతాయి’ అని తెలిపారు. పదవ తరగతి పరీక్షలకు సంబంధించి 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించిన విషయం తెలిసిందే. భౌతిక దూరం పాటిస్తూ జూలై 10వ తేదీ నుంచి 15 వరకూ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి పేపర్‌కు 100 ​మార్కులు ఉంటాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు సంబంధించి ఒక్కో పేపర్ మాత్రమే ఉంటుంది.

Similar News