విజయ్ సాయిరెడ్డి ‘మిడిల్ డ్రాప్’ వెనక కథేంటి?!

Update: 2020-05-07 10:39 GMT

వైసీపీలో చర్చనీయాంశంగా మారిన వీడియో

వైసీపీలో టాక్ ఏంటి అంటే జగన్ తర్వాత పార్టీలో...ప్రభుత్వంలో ఎవరు అంటే అంతా విజయసాయిరెడ్డి పేరే చెబుతారు?. ప్రభుత్వంలో ఆయనదే సెకండ్ ప్లేస్ అన్న ప్రచారం జోరుగా ఉంది. అందులోనూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత కీలకమైన విశాఖపట్నం బాధ్యతలు ఆయనకే అప్పగించారు. ఎందుకంటే అది కాబోయే రాజధాని ప్రాంతం కాబట్టి. విజయసాయిరెడ్డి కూడా తన ఫోకస్ అంతా వైజాగ్ మీదే పెట్టారు. ఈ తరుణంలో గురువారం నాడు తాడేపల్లిలో జరిగిన ఘటన వైసీపీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. విశాఖలో జరిగిన ఎల్ జీ పాలీమర్స్ దుర్ఘటన అనంతరం జగన్ తొలుత అధికారులతో సమీక్ష నిర్వహించారు. తర్వాత ఆయన విశాఖపట్నానికి బయలుదేరారు. ఆ సమయంలో సీఎం జగన్ తోపాటు ఆయన కారులో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఢిల్లీలో అధికార ప్రతినిధి అయిన విజయసాయిరెడ్డి కూడా ఎక్కారు. కానీ తర్వాత ఏమి జరిగిందో కానీ విజయసాయిరెడ్డి ను ఆ కారు దించేసి ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నానిని ఎక్కించుకున్నారు. సహజంగా ముఖ్యమంత్రి టూర్ అంటే హెలికాప్టర్ లో వెళ్ళినా..ప్రత్యేక విమానంలో ఎవరెవరు ఉంటారనే అంశంలో ముందే ఓ స్పష్టత ఇస్తారు.

అలాంటిది విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి కారు ఎక్కిన తర్వాత దింపేసి..ఆళ్ల నానిని కారు ఎక్కించుకోవటం వైసీపీ వర్గాలను ఒకింత షాక్ కు గురిచేసిందనే చెప్పాలి. అయితే విజయసాయిరెడ్డి పలు అంశాల్లో దూకుడుగా వెళుతున్నారని..ఆయన చర్యల వల్ల పార్టీ ఇరకాటంలో పడాల్సి వస్తోందని కొంత మంది నేతలు జగన్ కు ఫిర్యాదు చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో జగన్ కారు నుంచి విజయసాయిరెడ్డి ‘మిడిల్ డ్రాప్’ అయిన విషయానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వాట్సప్ లో హల్ చల్ చేస్తోంది. ఇది సీఎం క్యాంప్ ఆఫీసు లోపల జరిగింది. మీడియాకు కూడా లోపల అనుమతి ఉండదు. అలాంటిది ఈ వీడియో బయటకు రావటం అంటే వ్యూహాత్మక లీక్ కావొచ్చనే వాదన కూడా పార్టీ వర్గాల్లో ఉంది. జగన్ కూడా విజయసాయిరెడ్డికి ఏమైనా స్పష్టమైన సంకేతాలు పంపాలనే ఉద్దేశంతోనే దీనిని లీక్ చేశారా? అన్న చర్చ కూడా సాగుతోంది. చూడాలి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో.

https://www.youtube.com/watch?v=rRcnL_k0FP0

Similar News