ఫేస్ బుక్, రిలయన్స్ జియో జట్టు కట్టి కొన్ని రోజులైనా గడవక ముందే మరో బిగ్ డీల్ కుదిరింది. ఈ సారి అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ పార్ట్ నర్స్ జియోలో పెట్టుబడి పెట్టింది. అది ఎంతో తెలుసా?. అక్షరాలా 5655 కోట్ల రూపాయలు. జియోలో ఒక శాతం వాటా కొనుగోలుకు ఈ మొత్తాన్ని వెచ్చింది. జియోలో 9.99 శాతం వాటాను కొనుగోలుకు ఫేస్‌బుక్ 5.7 బిలియన డాలర్ల మెగా డీల్ చేసుకున్న వారం రోజుల తరువాత జియో మరో మెగా డీల్ సాధించడం విశేషం. దీనిపై ఇరు సంస్థలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి. ఈ ఒప్పందం మార్కెట్ రెగ్యులేటరీ, ఇతర సంబంధిత చట్ట అనుమతులను పొందాల్సి ఉందని ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్‌ఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ ఈ అంశంపై మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ టెక్నాలజీ కంపెనీ విలువైన భాగస్వామిగా నిలిచిన రికార్డు ఉన్న సిల్వర్ లేక్ భాగస్వామ్యం సంతోషాన్ని ఇస్తోందన్నారు. గ్లోబల్ టెక్నాలజీ సంస్థలతో ఒప్పందం డిజిటల్ ఇండియా సాధనలో కీలక పరిణామమని పేర్కొన్నారు.
మరోవైపు అత్యంత ముఖ్యమైన సంస్థలలో ఒకటిగా జియోను అభివర్ణించిన సిల్వర్ లేక్ కో సీఈఓ ఎగాన్ డర్బన్ చాలా బలమైన, వ్యవస్థాపక నిర్వహణ బృందం నేతృత్వంలో నడుస్తున్న సంస్థతో భాగస్వామ్యంపై సంతోషం వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్ పెట్టుబడితో పాటు, ఆర్ఐఎల్ ఇతర వ్యూహాత్మక, ఆర్థిక పెట్టుబడిదారుల భారీ ఆసక్తి నెలకొందని, రాబోయే నెలల్లో ఇదే తరహా పెట్టుబడిని సాధించనున్నామని తెలిపారు. రిలయన్స్ జియోలో కేవలం రెండు శాతం వాటాలను విక్రయించటం ద్వారా ఏకంగా 11 వేల కోట్ల రూపాయలను సంస్థ దక్కించుకోనుంది. ఈ నిధులను అప్పుల భారం తగ్గించుకోవటంతో పాటు నూతన టెక్నాలజీపై పెట్టుబడికి ఉపయోగించనున్నారు.