తెలంగాణలో లాక్ డౌన్ ను ఏప్రిల్ 30 వరకూ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రకటించారు. ఆయన అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 30 తర్వాత కూడా దశల వారీగా లాక్ డౌన్ ఎత్తేస్తామని తెలిపారు. అప్పటివరకూ తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సీఎంల సమావేశంలో ఒకరిద్దరు మినహా అందరూ లాక్ డౌన్ కొనసాగింపునకే మొగ్గుచూపారని..ఒకరిద్దరు మాత్రం రెడ్ జోన్లకే పరిమితం చేద్దామని సూచించగా...ఇందుకు ఎవరూ అంగీకరించలేదన్నారు. దీంతో పాటు కెసీఆర్ మరో కీలక ప్రకటన చేశారు. తెలంగాణలోని ఒకటి నుంచి తొమ్మిది తరగతి వరకూ విద్యార్ధులను పై తరగతులకు ప్రమోట్ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకూ ఇది వర్తిస్తుందని తెలిపారు. పదవ తరగతి పరీక్షలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కెసీఆర్ తెలిపారు.
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 503కు చేరిందని తెలిపారు. ఇప్పటివరకూ మరణాలు 14 ఉన్నాయన్నారు. ఇప్పటివరకూ 96 మంది పేషంట్లు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 393 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. మర్కజ్ కు వెళ్ళిన 1200 మందిని పట్టుకుని పరీక్షలు నిర్వహించామని.....ప్రస్తుతం 1654 మంది క్వారంటైన్ లో ఉన్నారని తెలిపారు. వీరు కూడా ఏప్రిల్ 24 వరకూ ఇంటికెళ్ళిపోతారని..కొత్తగా వస్తే కేసులు చూడాల్సి ఉంటుందని..భగవంతుడి దయవద్ద కొత్తగా ఏమీ రావద్దని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణలో మొత్తం 243 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయని..అందులో జీహెచ్ఎంసీ పరిధిలో 123 ఉంటే...ఇతర ప్రాంతాల్లో 120 ఉన్నాయని తెలిపారు. ప్రజలు ఇప్పటివరకూ ఎంతో బాగా సహకరించారని..ఈ పది రోజులు కూడా సహకరించాలని కెసీఆర్ కోరారు.