టీసీఎస్ తో అయాన్ తో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎంవోయు

Update: 2020-04-22 12:32 GMT

ప్రముఖ ఐటి సంస్థ టీసీఎస్ కు చెందిన వ్యాపార విభాగం టీసీఎస్ అయాన్ తో తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని కాలేజీ విద్యార్ధులకు ఈ సంస్థ శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణ ద్వారా రాబోయే రోజుల్లో విద్యార్ధులకు ఉపాధి అవకాశాలు పొందటం సులభం అవుతుందని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ భాగస్వామ్యం కింద, ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కోర్సు ను టీసీఎస్ అయాన్ డిజిటల్ లెర్నింగ్ హబ్ ద్వారా పొందవచ్చు. తెలంగాణాలో ఉన్న 1500కు పైగా ఉన్నత విద్యా సంస్థలకు చెందిన నాలుగు లక్షల మంది విద్యార్థులు పూర్తి ఉచితంగా ఈ విద్యా సంవత్సరం నుంచి దీనిని పొందవచ్చు. ఈ కోర్సు , విద్యార్థుల ఉద్యోగ సామర్థ్యాన్ని మెరుగుపరిచే రీతిలో ఉండటంతో పాటుగా గ్రాడ్యుయేషన్ తరువాత ఉద్యోగ విపణిలో పోటీపడటానికి సన్నద్ధం చేసే రీతిలో విభిన్నమైన అంశాల సమ్మేళనంగా ఉంటుందని తెలిపారు.

ఈ కోర్సులను ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ ఉపకరణం మీద అయినా టీఎస్సీ హెచ్ఈ వెబ్ సైట్ ద్వారా పొందవచ్చు. ఈ భాగస్వామ్యం గురించి టీసీఎస్ అయాన్ గ్లోబల్ హెడ్ వెంగుస్వామి రామస్వామి మాట్లాడుతూ "రాష్ట్ర యువతను ప్రగతిశీల మార్గంలో తీర్చిదిద్దేంకు సహాయపడే అభ్యాస సాధనాల శ్రేణిని అందించేందుకు మేము కట్టుబడి ఉన్నామన్నారు. టీఎస్సీహెచ్ఈ , రాష్ట్ర నాయకత్వ ముందు చూపు మరియు రాష్ట్ర భావి పౌరులకు అత్యాధునిక టూల్స్ అందించాలనే వారి ప్రయత్నాలను మేము అభినందిస్తున్నాము. మేమ అందించబోయే నైపుణ్యాలు పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఉంటాయి'' అని అన్నారు. ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, ఛైర్మన్, టీఎస్సీహెచ్ఈ మాట్లాడుతూ " ఉద్యోగ విపణిలో పోటీపడడానికి తోడ్పడేందుకు అవసరమైన అన్ని నైపుణ్యాలను మా విద్యార్థులకు సమకూర్చడానికి టీసీఎస్ అయాన్ తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల తాము చాలా సంతోషంగా ఉన్నామన్నారు. భారీ సంస్థలలో ఒకటిగా టీసీఎస్ ఇప్పుడు, ఉన్నత విద్యా సంస్ధలతో కలిసి విద్యార్థుల పోటీతత్త్వాన్ని మెరుగుపరచడంలో అత్యంత కీలకమైన పాత్రను పోషించనుంది. భావి ఉద్యోగాలకు తగినట్లుగా తెలంగాణా యువతను సిద్ధం చేయాలనే టీఎస్ సీహెచ్ఈ ప్రయాణంలో భాగమైనందుకు టీసీఎస్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం'' అని అన్నారు.

Similar News