కరోనా కేసుల సంఖ్య తగ్గించి చూపొద్దు

Update: 2020-04-26 16:30 GMT

రాష్ట్రాలు కరోనాకు సంబంధించిన కేసుల సంఖ్యను తగ్గించి చూపొద్దని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వ్యాఖ్యానించారు. ఆయన ఆదివారం నాడు రాష్ట్రాల సీఎస్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అసలు ఆయన ఈ మాట చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?. కేంద్రానికి రాష్ట్రాలు తప్పుడు లెక్కలు ఇస్తున్నాయనే ఫిర్యాదులు అందాయా? అన్న చర్చ మొదలైంది ఇఫ్పుడు. కేసుల సంఖ్యపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేసులు పెరగటంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎక్కువ మందికి కరోనా పరీక్షలు నిర్వహించడం వల్ల కేసులు పెరగవచ్చని ఆయన అన్నారు.

రెడ్ జోన్, కంటెయిన్ మెంట్ జోన్ లపై ఎక్కువ దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. కరోనా నియంత్రణకు అందుబాటులో ఉన్న అన్ని సదుపాయాలను పూర్తిగా వినియోగించుకోవాలని కోరారు. కరోనా నియంత్రణకు లాక్ డౌన్ నిబంధనలను మే 3 వరకూ కట్టుదిట్టంగా అమలు చేయాలని రాజీవ్ గౌబా స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ లాక్ డౌన్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయడంతో దేశవ్యాప్తంగా మంచి మెరుగుదల కనిపిస్తోందని.. ఇదే స్ఫూర్తిని మరికొన్ని రోజులు పాటించగలిగితే కరోనాపై పోరాటంలో విజయం సాధించగలుగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Similar News