కరోనాపై పోరులో అలుపెరగని కృషి చేస్తున్న వైద్యులు, పారిశుధ్య కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ సోమవారం నాడు ప్రత్యేక వరాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వైద్య శాఖ సిబ్బందికి వారి వేతనాల్లో పది శాతం ప్రత్యేక ప్రోత్సాహకంగా ప్రకటించారు. వాళ్ళతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 95,392 మంది మున్సిపల్, గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు సీఎం ప్రోత్సాహకం కింద రూ. 5 వేలు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్ కార్మికులకు రూ. 7,500 వరకు ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం నాడు దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జీవో 31 జారీ చేశారు.