వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి

Update: 2020-03-11 13:35 GMT

కడప జిల్లాలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి బుధవారం నాడు వైసీపీలో చేరారు. తాడేపల్లిలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. రామసుబ్బారెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా వచ్చారు. వీరందరినీ జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమపై ఎలాంటి ఒత్తిళ్ళు లేవని, బెదిరింపుల కారణంగా తాము పార్టీ మారలేదని తెలిపారు. తాను జైలులో ఉన్న సమయంలో కూడా కార్యకర్తలు ధైర్యంగా పార్టీని నడిపించారని తెలిపారు. తమ కుటుంబం టిడిపి ఆవిర్భావం నుంచి పార్టీలో ఉందని, తన చిన్నాన్న పార్టీ జిల్లా అద్యక్షుడుగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారని, తాను కూడా అలాగే అన్ని పదవులు చేశానని, పార్టీ కోసం ఎన్ని కష్టాలు అయినా ఎదుర్కున్నామని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి అన్నారు.

అలాంటి తాను వైసీపీలో చేరానని, ఇది స్వచ్చందంగా జరిగిందని అన్నారు. పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకున్నానని అన్నారు. తెలుగుదేశం పార్టీపై ప్రజలలో నమ్మకం పోయిందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పేదల సంక్షేమపధకాలు, జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కృషి మొదలైనవన్ని తాను వైసిపిలో చేరడానికి కారణమయ్యాయని ఆయన అన్నారు.రాష్ట్రం ఆర్దిక ఇబ్బందులలో ఉన్నా డైనమిక్ గా జగన్ నిర్ణయాలు చేస్తున్నారని అన్నారు.

 

 

Similar News