జగన్ కేసు ఏప్రిల్ 9కి వాయిదా

Update: 2020-02-12 11:21 GMT

తెలంగాణ హైకోర్టులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేసు ఏప్రిల్ 9కి వాయిదా పడింది. వారం వారం కోర్టుకు హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. జగన్ పిటీషన్ పై హైకోర్టు సీబీఐను కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. సీబీఐ కౌంటర్ దాఖలు చేయటంతో హైకోర్టులో ఈ అంశం బుధవారం నాడు విచారణకు వచ్చింది. హైకోర్టులోనూ సీబీఐ జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును వ్యతిరేకిస్తూ కౌంటర్ దాఖలు చేసింది. జగన్ కు మినహాయింపు ఇవ్వొద్దని అందులో కోరింది. దీంతో హైకోర్టు ఈ కేసు విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. జగన్ ప్రస్తుతం 11 కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన తరపున తన లాయర్ హాజరు అవుతారని..అవసరమైన సమయంలో తాను వస్తానని చెప్పినా సీబీఐ కోర్టు మినహాయింపు ఇవ్వటంలేదని జగన్ తన పిటీషన్ లో పేర్కొన్నారు.

ముఖ్యమంత్రిగా అధికారిక విధుల్లో బిజీగా ఉన్నందునే ఈ మినహాయింపు కోరుతున్నట్లు జగన్ తెలిపారు. సీబీఐ కేసులతోపాటు ఈడీ కేసుల్లోనూ జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని..ఈ కేసులో జగన్ హోదా మార్పు తప్ప ఎలాంటి మార్పులు లేనందున జగన్ హాజరు కావాల్సిందేనని విచారణ సంస్థలు సీబీఐ కోర్టులో వాదించాయి. ఈ వాదనలకే సీబీఐ కోర్టు మొగ్గుచూపుతూ జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వటం సాధ్యంకాదని తెలిపింది. దీంతో జగన్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

 

Similar News