వెలిగొండ పనులను పరిశీలించిన జగన్

Update: 2020-02-20 11:08 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పనుల ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకోవటంతో పాటు..ఎప్పటికి పనులు పూర్తవుతాయి అనే విషయాలపై ఆరా తీశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం జిల్లాతోపాటు కడప, నెల్లూరు జిల్లాల్లో 4,47,300 ఎకరాలకు సాగునీరు అందనుంది. జిల్లాలోని పెద్దదోర్నాల మండల పరిధిలోని కొత్తూరు వద్ద జరుగుతున్న పనులను జగన్ పర్యవేక్షించారు. ప్రాజెక్ట్‌ మొదటి టన్నెల్, రెండో టన్నెల్‌ లోపలికి వెళ్లి పనులను పరిశీలించారు. వచ్చే జూన్‌కల్లా ఒకటో సొరంగం నుంచి నీటి విడుదలకు సర్కారు చర్యలు తీసుకుంటోంది. పనుల పరిశీలన అనంతరం ప్రాజెక్ట్‌ వద్దే జిల్లా ఉన్నతాధికారులు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా వరద నీటిని మళ్లించి సాగు, తాగునీరు అందించేందుకు వీలుగా ఈ ప్రాజెక్ట్‌ ను రూపొందించారు. ప్రకాశం జిల్లాలోని 23 మండలాల పరిధిలో 3,36,100 ఎకరాలకు సాగునీరు, కడప జిల్లాలోని రెండు మండలాల పరిధిలో 27,200 ఎకరాలు, నెల్లూరు జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో 84వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. మూడు జిల్లాలకు కలిపి 15.25 లక్షల మంది జనాభాకు తాగునీరు అందించేందుకు ప్రాజెక్టు డిజైన్‌ తయారు చేశారని అధికారులు వివరించారు.

 

 

Similar News