కేంద్ర బడ్జెట్ పై ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీకి విభజన అప్పుడు హామీ ఇచ్చిన ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలను కూడా అమలు చేయటంలేదని ఆరోపించారు. ఆయన శనివారం నాడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. 2018-19లో రాష్ట్రానికి ఇవ్వాల్సిన పన్నుల వాటా రూ. 2,500 కోట్లు తగ్గించారు. ఈ బడ్జెట్‌లో కూడా అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. వ్యవసాయానికి గోదాములు కెపాసిటీ పెంచే ఏర్పాటు, రాజ్యలక్ష్మి గ్రూప్‌లకు ఆర్థిక సాయం, కిసాన్ రైతు పథకాలు బాగున్నాయి. కృషి ఉడాన్ ఏర్పాటు కూడా స్వాగతించ తగిన అంశం. వెనకబడిన జిల్లాల్లో ఆస్పత్రులకు ఉద్దేశించిన ఆయుష్మాన్ భారత్ నిర్ణయం మంచిదే. బ్యాంక్ డిపాజిట్లను భద్రతను రూ. 5లక్షకు పెంచారు. రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి ట్యాక్స్ తగ్గించారు. 2014లో రాష్ట్ర ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా విభజన జరిగింది. విభజన సమయంలో ఇచ్చిన హామీలు పూర్తికాలేదు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు.. కానీ ఇప్పటివరకు ప్రత్యేక హోదాకు సంబంధించి ఎలాంటి హామీ లేదు. వెనకబడిన 7 జిల్లాలకు ప్రత్యేక గ్రాంట్ ఇస్తామని చెప్పారు.. కానీ అవి కూడా ఇప్పటివరకు పూర్తిగా రాలేదు. పోలవరానికి సంబంధించిన నిధుల విడుదల కూడా ఆలస్యం అవుతుంది.
దుగ్గరాజపట్నం సాంకేతికంగా ఆలస్యమయితే రామాయపట్నం ఇవ్వాలని కోరాం. కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ప్రత్యేక హోదా కోసం గత ఐదేళ్ల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి బడ్జెట్ నిరాశజనకంగా ఉందన్నారు. రాష్ట్రంలో అసమర్థ ప్రతిపక్షం ఉందని.. కేంద్ర బడ్జెట్‌పై స్పందించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడమే అజెండాగా పెట్టుకుందని మండిపడ్డారు. కొన్ని ప్రభుత్వ ఆఫీసులను కర్నూలకు తరలించడంలో తప్పేముందన్నారు. చంద్రబాబు చెప్పినట్టు అభివృద్ధి అంతా అమరావతిలోనే జరిగితే.. శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతోనే అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నామని చెప్పారు. టీడీపీలా దోచుకోకపోవడం మా అసమర్థతా?. దీనికి టీడీపీ నేత యనమల రామకృష్ణుడు సమాధానం చెప్పాలి. టీడీపీ చేసిన తప్పులను ప్రశ్నించినవారు చెడ్డవాళ్లా?. టీడీపీ చేసిన అవినీతి వల్ల.. రాష్ట్రంలో కరెంట్ బిల్లు కట్టే ప్రతి ఒక్కరిపై భారం పడుతోంది.