మంత్రులపై యనమల సంచలన వ్యాఖ్యలు

Update: 2020-01-23 05:24 GMT

శాసనమండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఏపీ మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది మంత్రులు సభలోకి తాగి వచ్చారని ఆరోపించారు. మరి కొంత మంది గుట్కాలు వేసుకున్నారని..నిషేధిత ఉత్పత్తులు వీళ్లకు ఎలా అందుబాటులోకి వచ్చాయని ప్రశ్నించారు. సభా గౌరవం, మంత్రుల తీరును ముఖ్యమంత్రి పరిశీలించాలి కదా? అని ప్రశ్నించారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెలక్ట్ కమిటీకి బిల్లు వెళ్ళాక ఆర్డినెన్స్ ఇవ్వటం అసాధ్యం అని యనమల తెలిపారు. సుప్రీంకోర్టు నిబంధనలకు ఇది వ్యతిరేకం అన్నారు. తాము కోరింది కేవలం మండలికి సంబంధించిన సెలక్ట్ కమిటీ మాత్రమేనని..ఇందులో అసెంబ్లీ సభ్యులు ఉండే అవకాశం ఉండదన్నారు.

తాము జాయింట్ సెలక్ట్ కమిటీని కోరలేదన్నారు. సెలక్ట్ కమిటీ ఏర్పాటు తర్వాత ప్రజాభిప్రాయం కూడా తీసుకోవచ్చని..అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజాభిప్రాయం తీసుకోవటానికి సమయం పడుతుందని పేర్కొన్నారు. సెలక్ట్ కమిటీ కనీస సమయం మూడు నెలలు అని..అంతే కానీ మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఏమీలేదన్నారు. మండలి రద్దుకు తాము ఎప్పుడూ బాధపడం, భయపడం అని వ్యాఖ్యానించారు. తమ సభ్యుడు లోకేష్ ను కొట్టే ప్రయత్నం కొంత మంది చేశారని యనమల ఆరోపించారు. సభలో గతంలో ఎప్పుడూ జరగని పరిణామాలు జరిగాయన్నారు.

 

 

Similar News