రాజధాని రైతులకు వైసీపీ ఎంపీ మద్దతు

Update: 2020-01-31 12:29 GMT

కీలక పరిణామం. రాజధాని రైతులకు ఓ వైసీపీ ఎంపీ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఇప్పటివరకూ రాజధాని రైతులు చేస్తున్న ధర్నాలవైపు వైసీపీ నేతలు ఎవరూ కన్నెత్తి చూడని తరుణంలో నరసరావుపేటకు చెందిన వైసీపీ ఎంపీ లావు శ్రీకష్ణదేవరాయలు మందడంలో రైతుల దీక్ష శిబిరాన్ని సందర్శించి వారినుద్దేశించి మాట్లాడారు. ఇది రాజకీయంగా అత్యంత కీలక పరిణామంగా మారింది. రైతుల సమస్యపై చర్చలకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన తెలిపారు. ప్రభుత్వం చర్చలకు పిలిచినప్పుడు వచ్చి వారి అభిప్రాయాలు చెప్పాలని రైతులకు సూచించారు.

రైతులు తమ సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని అన్నారు. ఇవి వ్యాపారాలు చేస్తే వచ్చిన ఆస్తులు కావని, వారసత్వంగా వచ్చినవాటిపై సహజంగానే భావోద్వేగం ఉంటుందని ఆయన అన్నారు.ముఖ్యమంత్రి జగన్ రైతుల పక్షపాతి అని ఆయన అన్నారు.రైతులకు న్యాయం చేసిన తర్వాతే ముందుకు వెళతారని కృష్ణదేవరాయలు చెప్పారు. రైతులతో చర్చలు జరిపేందుకు సర్కారు సిద్ధంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో అందరూ సహకరించటం వల్లే వైసీపీకి 151 సీట్లు వచ్చాయని పేర్కొన్నారు. రైతులకు సంఘీభావం తెలియజేసేందుకు వచ్చిన ఎంపీకి జెఏసీ నేతలు ధన్యవాదాలు తెలిపారు.

Similar News