రాజధాని మార్పుపై జనసేన న్యాయపోరాటం

Update: 2020-01-21 16:11 GMT

రాజధానిని అమరావతి నుంచి తరలించటానికి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుపై న్యాయపోరాటానికి జనసేన సిద్ధం అవుతోంది. ఈ అంశంపై న్యాయపరంగా ముందుకెళ్లేందుకు గల అంశాలపై సూచనలు ఇవ్వాల్సిందిగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లీగల్ సెల్ ను కోరారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు పార్టీలో నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని సూచించారు. యువతకు కేసుల నుంచి న్యాయవిభాగం రక్షణ కల్పించాలని అన్నారు. నెలలో తప్పనిసరిగా ఒకట్రెండు సార్లు న్యాయ విభాగంతో సమావేశం అవుతానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాజదాని అంశంపై న్యాయ విభాగం సూచనల ఆధారంగా ముందుకెళతామని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులపై న్యాయ విభాగం సూచనలు తీసుకుని ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని పేర్కొన్నారు.

నిర్భంధంపై కూడా న్యాయ పోరాటం

పోలీసు అధికారులు అనుమతులు లేకుండా జనసేన పార్టీ కార్యాలయంలోకి చొరబడటంతోపాటు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు పలువురు నాయకులను సొంత పార్టీ కార్యాలయంలోనే నిర్భందించడంపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని లీగల్ సెల్ సమావేశం తీర్మానించింది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10.30 నిమిషాల వరకు అక్రమంగా, అన్యాయంగా, దౌర్జన్యంగా, చట్టవిరుద్ధంగా నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తోంది.

ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షులను పార్టీ కార్యాలయంలోనే నిర్బంధించడం రాజ్యాంగ విలువలకు, వ్యక్తి స్వేచ్ఛకు విరుద్ధమైన చర్య. గాయపడిన రైతులను పరామర్శించనీయకుండా నియంత్రించడం ప్రజాస్వామ్య విలువలను మంటగలపడమే. మందడం గ్రామంలో పోలీస్ దుశ్చర్యలో గాయపడిన మహిళలను పరామర్శించనీయకుండా నియంత్రించడం ప్రజాస్వామ్య విలువలను మంటకలపడమే మరియు వ్యక్తి యొక్క ఏ ప్రాంతానికైనా తిరిగే ప్రాథమిక స్వేచ్ఛను హరించడమే. దీనిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తీర్మానంలో పేర్కొన్నారు.

 

 

Similar News