జనసేన నేతలను అడ్డుకున్న పోలీసులు

Update: 2020-01-20 16:16 GMT

రాజధాని ప్రాంతంలో పోలీసుల లాఠీచార్జిలో దెబ్బతిన్న రైతులను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లు మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్ తోపాటు 30 పోలీస్ యాక్టు అమల్లో ఉందని పర్యటన విరమించుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. అయితే ఆందోళనలో గాయపడ్డ ప్రజలను పరామర్శించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీగా తమపై ఉందని... ఎర్రబాలెం గ్రామం వరకు వెళ్లి గాయపడ్డ రైతులు, మహిళలకు సానుభూతి తెలుపుతామని పవన్ కళ్యాణ్ చెప్పినా పోలీసులు ముందుకు కదలనివ్వలేదు. దీంతో ఆగ్రహానికి గురైన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. "మా పార్టీ ఆఫీసులోకే వచ్చి మమ్మల్ని అడ్డుకోవడం అన్యాయం.

ఆక్టోపస్, యాంటీ నక్సల్ స్క్వాడ్, రిజర్వ్ , సివిల్ పోలీసులు తదితర విభాగాల నుంచి సుమారు 7 వేల 200 మంది పోలీసులను తీసుకొచ్చి రైతులపై దాడులు చేయడం బాధాకరం. రాజధాని అమరావతిలోనే ఉంటుందని ఇక్కడ ప్రజలకు మాటిచ్చాం. ఇది భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కలిసి తీసుకున్న నిర్ణయం. రాజధాని పర్యటనకు వెళ్తామంటే లా అండ్ అర్డర్ పేరు చెప్పి అడ్డుకుంటున్నారు. లాస్ట్ టైంలాగా కంచెలు దాటుకొని వెళ్లిపోగలం. అయితే పోలీసు శాఖ, లా అండ్ అర్డర్ పై ఉన్న గౌరవంతో ఇంతసేపు ఆగాను. మీది నిజంగా లా అండ్ అర్డర్ సమస్యే అయితే నా వాహనంతోపాటు మరో వాహనానికే పర్మిషన్ ఇవ్వండి.

మీరే నన్ను దగ్గరుండి రాజధాని గ్రామాల్లోకి తీసుకెళ్లండి. బాధిత రైతులు, మహిళలను పరామర్శించాక మీరే తీసుకురండ"ని కోరినా పోలీసులు అంగీకరించలేదు. జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని బిజెపి పెద్దలతో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇఛ్చారు. వైసీపీ ప్రభుత్వ ఆదేశాలతోనే పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాల వల్ల రాష్ట్రం నష్టపోతుందని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేసిన రాజధానిని ఎలా మారుస్తారని మనోహర్ ప్రశ్నించారు. ఐదు గంటల పాటు పోలీసులు నిర్భందించటం ఏమిటని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.

 

Similar News