బిజెపికి దగ్గరైన జనసేన

Update: 2020-01-14 03:42 GMT

జనసేన, బిజెపిలు దగ్గరయ్యాయి. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలసి ముందుకు వెళ్ళనున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ లు సోమవారం నాడు ఢిల్లీలో బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జెపీ నడ్డాతో సమావేశం అయ్యారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరినట్లేనని తేలిపోయింది. గత ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా విషయంలో బిజెపిపై తీవ్ర విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా బిజెపిపై సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే కొన్ని రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. అప్పుడే బిజెపి, జనసేనలు ఒక్కటి కాబోతున్నాయనే విషయం తేలిపోయింది.

పవన్ తాజా ఢిల్లీ పర్యటనతో దీనిపై క్లారిటీ వచ్చినట్లు అయింది. రాబోయే రోజుల్లో ఏపీలో బిజెపి, జనసేనలు కలసి ముందుకు సాగటం ఖాయమేనన్న అంశం తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ రెండు పార్టీల కలయిక కొత్త మార్పులకు నాంది కాబోతోంది. ఇప్పటికిప్పుడు ఈ ప్రభావం పెద్దగా ఉండకపోయినా వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి మాత్రం ఈ పొత్తు అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే ఈ పొత్తు రెండు పార్టీలకే పరిమితం అవుతుందా?. ఎన్నికల నాటికి వీళ్లతో ప్రస్తుత ప్రతిపక్షం అయిన టీడీపీ కూడా జతచేరుతుందా అన్నది విషయం తేలాల్సి ఉంది.

 

Similar News