ఒక్క నిర్ణయం. ఒకే ఒక నిర్ణయం ‘భారం’ ఇరవై వేల కోట్ల రూపాయలు కాబోతుందా?. అంటే ఔననే చెబుతున్నాయి ఏపీ మునిసిపల్ శాఖ వర్గాలు. అమరావతిపై ఇప్పటికే గత ప్రభుత్వం చేసిన ఖర్చు దాదాపు పది వేల కోట్ల రూపాయలు. రాజధాని తరలింపు నిర్ణయంతో ఈ ఖర్చు అంతా వృధా కాబోతుంది. తాజాగా ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి రైతులకు గత ప్రభుత్వం హామీ ఇఛ్చినట్లు ప్లాట్స్ అభివృద్ధి చేసి ఇస్తామని..లేదంటే వారే ఏదైనా మోడల్ చెప్పాలని కోరుతున్నారు. బొత్స చెప్పినట్లు 33 వేల ఎకరాలకు చెందిన రైతులకు ప్లాట్స్ డెవలప్ చేసి ఇవ్వాలంటే కనీసం మరో పదివేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ రాజధాని నిర్మాణాలు రానప్పుడు ప్లాట్స్ డెవలప్ చేయటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. వాటికి విలువ కూడా రాదు. అక్కడ రాజధాని వస్తే ఆ ప్లాట్స్ కు విలువ వస్తుందని లెక్కలేసి అప్పటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
కొత్తగా ఇఫ్పుడు అక్కడ ఒక్క భవనం కూడా కట్టనప్పుడు అభివృద్ధి చేసిన ప్లాట్స్ ను రైతులు ఏమి చేసుకోగలుగుతారు?. ఎలాంటి ఉపయోగం ఉండదని తెలిసినా కూడా ఆ భూములపై పది వేల కోట్ల రూపాయల వ్యయం చేసి డెవలప్ మెంట్ చేయటం అవసరమా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. అంతే కాదు..విశాఖపట్నానికి రాజధాని తరలిస్తే ఓ మూడు, నాలుగు వేల కోట్ల రూపాయలతో పని అయిపోతుందని సర్కారు నమ్మబలుకుతోంది. మరి రాజధానిలో ప్లాట్స్ డెవలప్ మెంట్ చేసేందుకు అయ్యే పది వేల కోట్ల రూపాయల వ్యయాన్ని ఏ ఖాతాలో వేస్తారు.
రైతులకు డెవలప్ మెంట్ చేసి ప్లాట్స్ ఇస్తామని చెబుతున్న సర్కారు కొత్తగా చేపట్టే నిర్మాణాలను అమరావతిలో కాకుండా మంగళగిరి పరిసర ప్రాంతాల్లో చేపడతామని చెప్పటానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవటం పెద్ద కష్టం కాదు. భూ సమీకరణ ద్వారా సేకరించిన భూమిలో అసలు మెట్ట ప్రాంతమే లేదా?.అంటే అదేమీలేదు. కానీ అసలు అక్కడ కొత్త నిర్మాణాలు చేపట్టడం జగన్ సర్కారుకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఈ కారణంతోనే రాజధాని తరలింపు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల ఏకంగా 20 వేల కోట్ల రూపాయల వృధా అయినట్లేనని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.