రాజధానిపై కేంద్రానికి సంబంధం లేదు

Update: 2020-01-05 10:54 GMT

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ దారిలోకే వచ్చారు. మోడీ శంకుస్థాపన చేసిన అమరావతిని ఎలా మారుస్తారంటూ ఇంత వరకూ ప్రస్తావించిన కన్నా ఆదివారం నాడు మాత్రం రివర్స్ గేర్ వేశారు. రాజధాని అంశం కేంద్రానికి సంబంధంలేదని తేల్చేశారు. రాష్ట్రం ఏమైనా అడిగితే సలహాలు, సూచనలు మాత్రమే చేస్తుందని ప్రకటించారు. అయితే అందరూ అంగీకరించిన తర్వాతే అమరావతిగా రాజధానిని ఎంపిక చేశారని..అప్పట్లో వైసీపీ కూడా అమరావతికి అనుకూలంగా ప్రకటన చేసిందని కన్నా వెల్లడించారు. బిజెపిలో రాజధానిపై భిన్నాభిప్రాయాలు ఏమీ లేవని..తాము క్లారిటీతోనే ఉన్నామని వ్యాఖ్యానించారు.

సీఎం జగన్ నియమించిన కమిటీలు ఆయన ఆలోచనలకు అనుకూలంగా అనుగుణంగా నివేదికలు ఇచ్చాయని ఆరోపించారు. స్టేక్ హోల్డర్స్ ఆమోదం లేకుండా ఇష్టం వచ్చినట్లు రాజధాని మార్చాలని నిర్ణయించటం సరికాదన్నారు. సీఏఏపై కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని కన్నా విమర్శించారు. శరణార్ధులకు మాత్రమే కొత్తగా పౌరసత్వం ఇవ్వబోతున్నామని...ఇందులో కొత్తదనం ఏమీలేదన్నారు. ఇందిరాగాంధీ హయాంలోనూ ఇదే జరిగిందని కన్నా తెలిపారు. జన్ జాగరణ్ పేరుతో బిజెపి ఈ అంశంపై ప్రచారం చేయనుందని తెలిపారు.

 

Similar News