సుకుమార్ తోనూ బన్నీ ‘హ్యాట్రిక్’ హిట్ కొడతారా?

Update: 2020-01-16 12:42 GMT

త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘అల..వైకుంఠపురములో’ దుమ్మురేపుతోంది. ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తోపాటు భారీ కలెక్షన్లు సాధిస్తోంది. త్రివిక్రమ్, అల్లు అర్జున్ మూడవ సినిమా ఇది. దీంతో ఇద్దరూ కలసి చేసిన మూడు సినిమాల విజయంతో ‘హ్యాట్రిక్’ హిట్ కొట్టినట్లు అయింది. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిందే అల..వైకుంఠపురములో. ఇప్పుడు అల్లు అర్జున్ మరో దర్శకుడితో అదే బాటలో పయనిస్తున్నారా?. అంటే ఆయన అభిమానులు మాత్రం గట్టిగా అదే నమ్మకంతో ఉన్నారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌తో కలిసి బన్నీ తన 20వ సినిమా చేయనున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మరి హ్యాట్రిక్ సినిమా కూడా అదే తరహాలో హిట్ సాధిస్తుందా? అంటే ఔననే నమ్మకంతో ఉన్నారు చిత్ర యూనిట్ కూడా.

అల వైకుంఠపురములో హిట్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. సుకుమార్ గత చిత్రం ‘రంగస్థలం’తో టాలీవుడ్‌కు ఓ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను అందించడంతో దాన్ని కొనసాగిస్తాడని బన్నీ అభిమానులు ధీమాతో ఉన్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన నటించనున్నారు. ప్రముఖ తమిళ నటుడు విజయ్‌ సేతుపతి విలన్‌గా కనిపించనున్నాడు. గీతాఆర్ట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే కేరళలోని పలు ప్రాంతాల్లో బన్నీతో సంబంధం లేని భాగాల షూటింగ్‌ను జరుపుతున్నారు. వచ్చే నెల ప్రారంభం నుంచి బన్నీ రెగ్యులర్‌ షూటింగ్‌కు హాజరుకానున్నాడు.

 

 

 

 

Similar News