తప్పులు చేసిన జగనే అలా ఉంటే..నేను ఎంత మొండిగా ఉండగలను

Update: 2019-12-03 12:08 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కారుపై విమర్శల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. మంగళవారం నాడు తిరుపతిలో ఉన్న ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా పవన్ స్పందించారు. ‘నా కులం మాటతప్పదని జగన్‌ అన్నారు. మిగతా కులాలు మాట తప్పుతాయనేది జగన్ ఆంతర్యమా?’ అని పవన్‌ ప్రశ్నించారు. ‘మీ ఎమ్మెల్యేలకు భాష తెలియదా? వారికి బూతులు తిట్టడమే పనా? చట్టాల్ని కాపాడాల్సిన ఎమ్మెల్యేలే పిచ్చి కూతలు కూస్తుంటే.. సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు?’ అని సీఎం జగన్‌ను ప్రశ్నించారు. అత్యాచారం జరిగినప్పుడు కులాన్ని చూసి స్పందించొద్దని అన్నారు. రైల్వేకోడూరులో బత్తాయి చెట్లను నరికివేయడం ఏం మానవత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న జగన్ ప్రభుత్వం.. 6 నెలల్లో ఉల్లిపాయల ధరను కూడా నియంత్రించలేకపోయిందని దుయ్యబట్టారు. సత్యం మాట్లాడుతున్నాం కాబట్టే ఒక్క ఎమ్మెల్యే ఉన్న జనసేనకు.. అధికార పార్టీ సమాధానం చెబుతోందని వ్యాఖ్యానించారు.

ఇప్పటి రాజకీయాలకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లాంటి వాళ్లే కరెక్ట్ అని అభిప్రాయపడ్డారు. ఉక్కుపాదంతో తొక్కినట్లు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. తప్పులు చేసి జైలులో గడిపిన జగన్ రెడ్డే అధికారం కోసం అంత మంకు పట్టు పట్టారు. భావితరాల బాగు కోసం ఆలోచించే తాను ఎంత కంటే మొండిగా తిరగగలనన్నారు. ప్రజల కోసం ఆలోచించే తపన తనకుందన్నారు.. మనస్సాక్షి ప్రకారం సమస్యల పట్ల స్పందిస్తానన్నారు. సమస్యలు ఎదురైతే తాను కళ్లకు గంతలు కట్టుకుని ఉండలేనని పేర్కొన్నారు. ఇప్పటి రాజకీయాలు చాలా దారుణంగా మారాయని, మోదీ, షా లాంటి వాళ్లే ఇప్పటి రాజకీయాలకు కరెక్ట్ అని పవన్ వ్యాఖ్యానించారు. ఎంతో కష్టమైన సమయంలో జనసేన పార్టీని పెట్టానని పవన్ వ్యాఖ్యానించారు. మార్పు తెచ్చేందుకే తమ పార్టీ కంకణం కట్టుకుందని పేర్కొన్నారు. రాయలసీమను కొన్ని గ్రూపులు కబ్జా చేసి పెట్టుకున్నాయని ఆరోపించారు.

 

Similar News