ప్లీనరీలో అమరావతికి ఓకే అన్నందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు జగన్ క్షమాపణ చెబుతారా?. మాట తప్పను..మడమ తిప్పను అంటే ఇదేనా?. కేంద్రం అమరావతిని గుర్తించింది. మ్యాప్ లో మార్పు చేసింది. ఏపీ నూతన రాజధానిగా కేంద్రం నోటిఫై చేయాలంటే మూడు ప్రాంతాల్లో దేన్ని నోటిఫై చేయాలి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. జగన్ మంగళవారం నాడు అసెంబ్లీలో చేసిన రాజధానుల ప్రకటనపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
‘కమిటీ నివేదిక రాక మునుపే జగన్ రెడ్డి మూడు రాజధానులు ప్రకటించేకాడికి అసలు కమిటీలు వేయటం దేనికి?. నిపుణులను అపహస్యం చేయటం దేనికి?’ అని ప్రశ్నించారు. తినటానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడంట.అలాగ ఒక్క అమరావతి రాజధానికే దిక్కూ దివాణం లేదు ఇఫ్పటి దాకా. మరి జగన్ రెడ్డి మూడుఅమరావతి నగరాలు అసలు అయ్యేనా?. పాలకుల వలన రాష్ట్ర విభజన మొదలుకుని , ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ప్రజల అనిశ్చితి, అశాంతి, అభద్రతల తప్ప ఇంకేమి ఒరగలేదని పవన్ వ్యాఖ్యానించారు.ఈ మేరకు ఆయన వరస ట్వీట్లు చేశారు.