జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలకు అధికార వైసీపీ కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. పవన్ కళ్యాణ్ ను హీరో అందామంటే ఆయనకు సినిమాలు లేవని..ప్రతిపక్ష నేత అందామంటే పోటీచేసిన రెండు చోట్లా ఓడిపోయారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. అసలు ఆయన్ను ఏమని పిలవాలో కూడా తెలియటం లేదని ఎద్దేవా చేశారు. మేథావి అందామంటే ఆయన అంతా అజ్ణాని మరొకరులేరని విమర్శించారు. సోమవారం నాడు మంత్రి అనిల్‌ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మతిస్థితమితం పోయి ఏమి మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదనుకుంటే.. పవన్‌ కూడా మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దమ్ము, ధైర్యం గురించి మాట్లాడే హక్కు పవన్‌కు లేదన్నారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం సోనియా గాంధీని ఎదురించిన వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్‌ అని గుర్తుచేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ దమ్ము, ధైర్యం గురించి ప్రజలందరికీ తెలుసనని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక రాయలసీమ పచ్చని డెల్టాగా మారిందన్నారు.

ప్రశ్నిస్తానన్న పవన్‌ కల్యాణ్‌ గత ఐదేళ్లలో ఏమి చేశాడో అందరికీ తెలుసని విమర్శించారు. పవన్‌ కళ్యాణ్ నిత్యం కులాలు, మతాల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో రెచ్చిపోయి మాట్లాడుతున్నారని.. వారిని ఆయన సన్మార్గంలో పెట్టాలని హితవు పలికారు. సీఎం వైఎస్‌ జగన్‌పై కడుపు మంటతోనే పవన్‌, చంద్రబాబు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని అన్నారు. అందుకే 2017లో కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటనను పట్టుకుని సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో జరిగనట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అది చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన ఘటన అని తెలియదా అని ప్రశ్నించారు. పవన్‌ ముందు న్యూస్‌ పేపర్‌ చదవడం నేర్చుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ప్రజలు ఎవరి తోలు తీసారో అందరికీ తెలుసనని వ్యాఖ్యానించారు. డిసెంబర్‌ 26న కడపలో ఉక్కు పరిశ్రమకు సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు.