జగన్ ముందు రాయలసీమ నేతల కొత్త డిమాండ్

Update: 2019-12-25 16:47 GMT

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం కొత్త చిచ్చు రేపుతోంది. ఎవరికి వారు కొత్త డిమాండ్లను తెరపైకి తీసుకొస్తున్నారు. ఓ వైపు అమరావతి రైతులు రాజధాని మార్చొద్దు అంటూ ఆందోళన చేస్తుంటే మిగిలిన ప్రాంతాల వారు మాత్రం కొత్త డిమాండ్లు లేవనెత్తుతున్నారు. బుధవారం నాడు రాయలసీమకు చెందిన నేతలు కొంత మంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. గ్రేటర్ రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని వారు లేఖలో కోరారు. పరిపాలన వికేంద్రీకరణను సమర్ధిస్తున్నామని చెప్పారు. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం హైకోర్టు ఏర్పాటు హర్షణీయమని సీమ నేతలు లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై గంగుల ప్రతాప్‌రెడ్డి, మైసూరారెడ్డి, శైలజానాథ్‌, చెంగారెడ్డి, మాజీ డీజీపీలు ఆంజనేయరెడ్డి, దినేష్‌రెడ్డి సంతకాలు చేశారు.

విశాఖ ప్రజలు రాయలసీమకు రావటానికి దూరమైనప్పుడు ..తమకూ విశాఖ వెళ్లటానికి అంతే దూరం అవుతుంది కదా? అని మాజీ మంత్రి, సీనియర్ నేత మైసూరారెడ్డి ప్రశ్నించారు. రాయలసీమ ఎప్పటి నుంచో రాజధాని కోరుతోందని..ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడూ కోరకపోయినా వారికి ఎందుకు రాజధాని ఇస్తున్నారని ప్రశ్నించారు. గతంలో కర్నూలు రాజధానిని త్యాగం చేసినందున ఇఫ్పుడు రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని కోరారు. రాయలసీమకు చెందిన టీజీ వెంకటేష్ ఇప్పటికే కర్నూలు, అమరావతిలో మినీ రాజధానులు ఏర్పాటు చేయాలన్న వాదనను తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. విశాఖలోనే రాజధాని ఉంటే రాయలసీమ వాసులకు ఇబ్బందులు తప్పవని, ఉద్యమాలు మొదలయ్యే అవకాశం ఉందని టీజీ ప్రకటించారు.

 

Similar News