జనవరి 1 నుంచి ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులే

Update: 2019-12-16 14:11 GMT

ఏపీలోని ఆర్టీసీ కార్మికులకు శుభవార్త. కొత్త సంవత్సరం నుంచి వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఈ మేరకు సోమవారం నాడు ఏపీ అసెంబ్లీలో బిల్లును ఆమోదించారు. కార్మికుల మోముల్లో చిరునవ్వు చూసేందుకు మంచి మనసుతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లుకు శాసనసభ సోమవారం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... 52వేల మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు తెలిపారు. అధికారంలో ఉన్న అయిదేళ్లపాటు చంద్రబాబు ఆర్టీసీ కార్మికులను పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. ప్రైవేట్‌ రంగ సంస్థల్లోని ఉద్యోగులు... ప్రభుత్వంలో విలీనం కాకుండా గతంలో చంద్రబాబు చట్టం తెచ్చిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు.

చంద్రబాబు తెచ్చిన చట్టం అడ్డంకిగా మారిందని, అందుకే ఆర్టీసీ విలీనం కోసం ఈ బిల్లును ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు చేసిన వ్యాఖ్యలపై రవాణా, సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని సమాధానం ఇస్తూ...‘ఛార్జీల పెంపు వల్ల ప్రజలు ఆర్టీసీకి దూరం అయిపోతున్నారని రామానాయుడుగారు బాధపడుతున్నారు. మీరు విచారం వ్యక్తం చేసేంతగా ఏం జరగడం లేదు. ఆయన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఛార్జీల పెంపుతో ప్రజలు బస్సులు ఎక్కడం మానేయలేదు. ఇవాళ మీరు కంగారు పడేంతగా సామాన్యుల మీద భారం పడలేదు. స్వల్పంగా ఛార్జీలు పెంచామన్నారు.

 

Similar News