జనసేనను పవన్ బిజెపిలో కలిపేస్తున్నారు

Update: 2019-12-03 12:35 GMT

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, జనసేనల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. గత రెండు రోజులుగా రాయలసీమలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనికి అధికార వైసీపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. తిరుపతిలో పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాలకు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాల వంటి వారే కరెక్ట్ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ఆసరా చేసుకుని వైసీపీ ఎదురుదాడి ప్రారంభించింది. ఈ మాటలు చూస్తుంటే పవన్ కళ్యాణ్ త్వరలోనే జనసేనను బిజెపిలో విలీనం చేస్తున్నట్లు కన్పిస్తోందని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. మరో మంత్రి కొడాలి నాని కూడా పవన్ కళ్యాణ్ తీరుపై విమర్శలు గుప్పించారు. 151 సీట్లు వచ్చిన వైసీపీని, ముఖ్యమంత్రి జగన్ ను పవన్ కళ్యాణ్ గుర్తించాల్సిన అవసరం లేదని అన్నారు.

ప్రజలు గుర్తించే ఇన్ని సీట్లు ఇచ్చారన్న సంగతి ఆయనకు తెలియకపోతే ఎవరేమి చేస్తారని ప్రశ్నించారు. బిజెపిలో పార్టీని కలిపేందుకే ఈ పొగడ్తలు అని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా సినిమాల్లో చెప్పినట్లు డైలాగ్ లు చెపితే సాధ్యంకాదని పేర్ని నాని వ్యాఖ్యానించారు. పవన్ ప్రజా నాయకుడు కాదని..సినిమాల్లోనూ..బయటా కూడా నటుడే అన్నారు. కొడాలి నాని మరోసారి చంద్రబాబుపై కూడా విమర్శలు గుప్పించారు. అమరావతిలో చంద్రబాబుపై దాడి చేసింది రైతులే అన్నారు. తాము దాడి చేయాలనుకుంటే కర్నూలులో చేయలేమా ?అని ప్రశ్నించారు. జగన్ కు వస్తున్న మంచి పేరు చూసి ఏడ్వొద్దని వ్యాఖ్యానించారు.

 

Similar News