జగన్ సర్కారు సంచలన నిర్ణయం...ఏపీ సీఎస్ పై వేటు

Update: 2019-11-04 10:46 GMT

ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం పై వేటు వేసింది. ఈ మేరకు సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. గత కొంత కాలంగా సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మధ్య విభేదాలు తలెత్తాయి. అయితే ప్రవీణ్ ప్రకాష్ నిబంధనలకు విరుద్దంగా ఫైల్స్ నడపటంతోపాటు పలు ఉల్లంఘనలకు పాల్పడారనే ఆరోపణలు ఎదుర్కొంటారు. ఇదే అంశాలను ప్రస్తావిస్తూ నవంబర్ 1న సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఏకంగా సీఎంవోలోని ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు ఓ మెమో జారీ చేశారు. వారంలోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ వ్యవహారం పెద్ద కలకలం రేపింది.

అయితే ప్రవీణ్ ప్రకాష్ ఎక్కడెక్కడ ఉల్లంఘనలకు పాల్పడ్డారో ఎల్వీ సుబ్రమణ్యం తన మెమోలో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం తప్పులు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రవీణ్ ప్రకాష్ ను కాకుండా ఆయన తప్పులను ఎత్తిచూపిన సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంపై వేటు వేయటం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. ఎల్వీ సుబ్రమణ్యాన్ని సీఎస్ పదవి నుంచి తప్పిస్తూ జీవో 2478 విడుదలైంది. తక్షణమే ఈ బదిలీ అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఏపీ హ్యుమన్ రిసోర్సోస్ డిపార్ట్ మెంట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, బాపట్లలో డైరక్టర్ జనరల్ గా నియమించారు. ఈ ఉత్తర్వులను జీఏడీ పొలిటికల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జారీ చేశారు. తక్షణమే ఎల్వీ సుబ్రమణ్యం సీసీఎల్ ఏకు బాధ్యతలు అప్పగించాలని జీవోలో పేర్కొన్నారు.

Similar News