డంపింగ్ యార్డులుగా పోలీసు అకాడమీలు

Update: 2019-10-03 09:03 GMT

వీ కె సింగ్. సీనియర్ ఐపీఎస్ అధికారి. సంచలన వ్యాఖ్యలకే కేరాఫ్ అడ్రస్ గా మారారు. గతంలోనూ ఆయన రాజకీయాలతో బంగారు తెలంగాణ రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి పోలీసు అకాడమీలపై..పోలీసు వ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రస్తుతం తెలంగాణ పోలీసు అకాడమీ డైరక్టర్ గా ఉన్నారు. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. తెలంగాణ పోలీస్ అకాడమీ వల్ల ఎలాంటి లాభం లేదని, దీని కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తున్న డబ్బు వృథా అవుతోందని ఆయన పేర్కొన్నారు. నేషనల్ పోలీస్ అకాడమీలో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని ఆయన పేర్కొన్నారు. పోలీసుల ప్రవర్తన సరిగ్గా లేదని ఆయన తప్పుబట్టారు. జైలులో ఉన్నవారు 90 శాతంమంది పేదవారేనని, తినడానికి తిండి కూడా లేనివారే జైళ్లలో మగ్గుతున్నారని ఆయన పేర్కొన్నారు. మరికొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయి జైల్‌కు వచ్చామో కూడా తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. పోలీసు అకాడమీలో ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ తీసుకున్న ఐపీఎస్‌లు సైతం ప్రజల్లో పోలీసులుపై ఉన్న అభిప్రాయాన్ని మార్చలేకపోతున్నారు.

దేశంలోని పోలీస్ అకాడమీలన్నీ డంపింగ్ యార్డ్‌ లుగా మారాయి. ఈ అకాడమీలో పోలీసులు తీసుకుంటున్న శిక్షణ వల్ల సమజానికి ఎలాంటి ఉపయోగం లేదు. జైలుకు వచ్చే నేరస్తులు తోటి ఖైదీలను చూసి నేరాల్లో చేయడంలో కొత్త టెక్నిక్ నేర్చుకొంటున్నారు. కానీ పోలీసులు మాత్రం వాస్తవానికి అనుగుణంగా ఉండలేకపోతున్నారు. పోలీసులు సామాజిక కార్యకర్తలగా వ్యవహరించాలి. డబ్బు, అధికారం ఉన్న వాళ్ళతోటే పోలీసులు స్నేహంగా ఉంటున్నారు. బ్రిటీష్ కాలం నాటి ఆనవాయితే ఇప్పటికీ కొనసాగుతోంది. పోలీసులు ప్రభుత్వానికి జవాబుదారీ కాదు.. చట్టానికి, న్యాయానికి మాత్రమే జవాబుదారీ. అకాడమీలో ఇస్తున్న శిక్షణ గ్రౌండ్ లెవల్‌కు లింకై ఉండాలి. పోలీస్ శిక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాయి. కానీ దానివల్ల ఎలాంటి లాభం లేదు అని వ్యాఖ్యానించారు.

 

Similar News