తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పై ఆర్టీసి కార్మిక నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆర్టీసి ఆస్తులపై కన్నేసి..ప్రజా రవాణి సంస్థను ప్రైవేట్ పరం చేసేందుకే ఆయన ప్రయత్నిస్తున్నారని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆదివారం ఆరోపించారు. సగం ప్రైవేటు బస్సులు తీసుకునే ఉద్దేశం ఆ కుట్రలో భాగమేనన్నారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు క్రమబద్ధ నియామక ప్రక్రియతో ఉద్యోగాలు పొందారని, రాజకీయ నేతలు మంత్రులు, చైర్మన్‌లుగా అయినట్టు కాదన్నారు. అలాంటి ఉద్యోగులను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. తమకు రాజ్యాంగం కల్పించిన హక్కులున్నాయని, వాటిని కూలదోసే హక్కు ముఖ్యమంత్రికి లేదన్నారు.
సీఎం నిర్ణయాన్ని తాము న్యాయపరంగానే ఎదుర్కొంటామని, ఇందులో కార్మికులెవరూ భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. తమ సమ్మె న్యాయబద్ధమైనదని, దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారన్న ఆయన, ఇప్పుడు ప్రజలు తెలంగాణతోపాటు ఆర్టీసిని కూడా కాపాడుకోవాల్సిన తరుణమొచ్చిందన్నారు. ముఖ్యమంత్రి దుర్మార్గపు ఆలోచన ఈ సమావేశంలో మరోసారి వెల్లడైందని, కొత్త నియామకాల్లో వచ్చే ఉద్యోగులు కార్మిక సంఘాల్లో చేరొద్దని చెప్పటం దారుణమన్నారు. తమను కార్మిక సంఘాల్లో ఉండొద్దన్నప్పుడు సీఎం రాజకీయ పార్టీలో ఎలా ఉంటారని ప్రశ్నించారు. కెసీఆర్ వయసులో చిన్నవాడైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని చూసి నేర్చుకోవాలని సూచించారు.