ఆర్టీసి సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Update: 2019-10-15 12:41 GMT

ఆర్టీసి సమ్మె వ్యవహారంలో హైకోర్టు తెలంగాణ సర్కారు తీరుతోపాటు..కార్మిక సంఘాల వ్యవహారాన్ని కూడా తప్పుపట్టింది. అదే సమయంలో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని వ్యాఖ్యానించింది. ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. కార్మికులు కూడా ప్రజల్లో భాగమని గుర్తుంచుకోవాలని సూచించింది. అంతే కాకుండా ఎండీ లేకుండా ఆర్టీసీని ఎలా నడుపుతున్నారని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. తక్షణమే ఆర్టీసికి ఎండీని నియమించాలని ఆదేశించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమింపజేసే విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును కోర్టు తప్పుపట్టింది. సమ్మె ప్రభావం ప్రజలపై పడకుండా చర్యలు తీసుకుంటున్నామని సర్కారు తరపు ప్రతినిధులు కోర్టుకు నివేదించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే పాఠశాలలకు ఎందుకు సెలవులు పొడిగించాల్సి వచ్చిందని ప్రశ్నించింది.

ఆర్టీసి సమ్మెతో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని..వేలాది బస్సులు నడవటంలేదని కోర్టు వ్యాఖ్యానించింది. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత సర్కారుపైనే ఉందని వ్యాఖ్యానించింది. కార్మికులు కోరుతున్నట్లు ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయటం సాధ్యంకాదని..అలా చేస్తే మిగిలిన కార్పొరేషన్లు కూడా ఇదే బాట పడతాయని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అదే సమయంలో ఆర్టీసి కార్మికులపై ఎస్మా ఎందుకు ప్రయోగించకూడదని కోర్టు వారి తరపు లాయర్లను ప్రశ్నించింది. కార్మికుల డిమాండ్లు న్యాయబద్దమైనవే అయినప్పటికి పండగ సమయంలోప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం ముందు కోర్టు సూచనలు ఉంచుతామని అదనపు అడ్వకేట్ జనరల్ తెలపగా..18వ తేదీ నాటికి నివేదిక అందజేయాలని కోర్టు ఆదేశించింది.

 

Similar News