అగ్నిమాపక శాఖ సచివాలయం కూల్చమనలేదు కదా?

Update: 2019-10-14 14:04 GMT

తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత అంశంపై హైకోర్టులో సోమవారం నాడు వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు పలు అంశాలను లేవనెత్తింది. అగ్నిమాపక శాఖ భవనాలకు ప్రమాదం పొంచి ఉందని చెప్పింది..భవనాలు కూల్చమని చెప్పలేదు కదా? అని కోర్టు ప్రశ్నించింది. అదే సమయంలో ఏపీ వెనక్కి ఇచ్చిన భవనాలు సచివాలయానికి సరిపోవా?. అంటూ పలు ప్రశ్నలు సంధించింది. కొత్త సచివాలయ నిర్మాణం వల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుందని..దీన్ని అడ్డుకోవాలంటూ పీఎల్ విశ్వేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా అసలు సచివాలయాన్ని ఎందుకు కూల్చాలనుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది.

సాంకేతిక కమిటీ కూడా కొత్త సచివాలయం నిర్మించాలని సిఫారసు చేసిందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు నివేదించగా..కేబినెట్ నిర్ణయం తర్వాతే ఈ కమిటీ నివేదిక ఇచ్చిన అంశాన్ని హైకోర్టు ప్రస్తావించింది. అదే సమయంలో పిటీషనర్ తరపు న్యాయవాదిని కూడా హైకోర్టు పలు ప్రశ్నలు అడిగింది. పరిపాలనా వ్యవహారాల్లో ఎలా జోక్యం చేసుకుంటారని ప్రశ్నించింది. సచివాలయ నిర్మాణం ప్రజల కోసమే కదా? అని వ్యాఖ్యానించింది. అప్పులతో రాష్ట్రంలో పనులు నిలిచిపోయాయని..ఈ తరుణంలో కోట్లాది రూపాయల వ్యయంతో కొత్త సచివాలయం ఏర్పాటు అవసరంలేదని పిటీషనర్ తరపు న్యాయవాది వాదించారు. ప్రజాధనం ఎలా వ్యయం చేయాలో ప్రభుత్వం చూసుకుంటుంది కానీ..కోర్టులు కాదని అన్నారు. ఇరుపక్షాల వాదనల విన్న తర్వాత ఈ అంశాన్ని హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.

 

 

Similar News