టీఆర్ఎస్ లో మరో కలకలం

Update: 2019-09-12 10:39 GMT

అధికార టీఆర్ఎస్ లో మరో కలకలం. నేతల అసంతృప్తి ప్రస్తుతానికి చల్లారినట్లు కన్పిస్తున్నా అంతర్గతంగా అది జ్వాలలా రగులుతుందా? తమ అవసరాల కోసం ప్రస్తుతానికి అంతా వేచిచూస్తున్నారా? సమయం వచ్చినప్పుడు తమ సత్తా ఏంటో చూపిద్దామని ప్లాన్స్ వేసుకుంటున్నారా?. పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉన్నాయని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల వరకూ సమయం ఉన్నందున పార్టీతో విభేదించి బయటకు వచ్చి ఇప్పటికిప్పుడు అన్ని రకాలుగా నష్టపోవటం ఎందుకు అనే కోణంలో చాలా మంది నేతలు మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. అదను చూసి దెబ్బకొట్టేందుకు చాలా మంది వేచిచూస్తున్నారు. మరో వైపు కేంద్రంలో అధికార పార్టీగా ఉన్న బిజెపి ఎప్పుడెప్పుడు టీఆర్ఎస్ ను దెబ్బకొడతామా? అని కాచుకుకూర్చుంది. అదే సమయంలో ఏ అవకాశం వచ్చినా వదలకూడదని ఆ పార్టీ నిర్ణయించుకుంది.

గురువారం నాడు జరిగిన పరిణామాలు టీఆర్ఎస్ లో కలకలం రేపుతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి మరో ఎమ్మెల్యే షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు కన్పిస్తోంది. టీఆర్‌ఎస్‌ బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అహ్మద్‌ గురువారం నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. మొన్నటి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించలేదని షకీల్‌ అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ...అర్వింద్‌తో సమావేశం కావడంతో టీఆర్‌ఎస్‌లో కలకలం రేపుతోంది. భేటీ అనంతరం షకీల్‌ పార్టీ మారడంపై స్పందించారు. పార్టీ మారితే మారొచ్చు అంటూ స్పష్టమైన సంకేతాలు పంపారు. ప్రస్తుతానికి అసంతృప్తి నేతలు మెత్తపడినట్లు కన్పిస్తున్నా అదను చూసి దెబ్బకొట్టే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.తాను రాజీనామా చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు షకీల్ తెలిపారు. కెసీఆర్ దయవల్లే తాను గెలిచానని..అయితే ఆయన్ను కొంత మంది తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.

 

Similar News