హైదరాబాద్ లో బాంబు పేలుడు కలకలం

Update: 2019-09-08 10:30 GMT

ఓ వైపు వినాయకచవితి ఉత్సవాలు కొన్ని చోట్ల నిమజ్జన సందడి. ఈ తరుణంలో హైదరాబాద్ లో బాంబు పేలుడు కలకలం రేపింది. అయితే ఈ ఘటనలో పెద్దగా ప్రాణనష్టం లేకపోవటం ఊరట కలిగించే అంశం. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం ఉదయం స్థానిక పుట్‌పాత్‌పై పడిఉన్న బాక్సును ఓ వ్యక్తి తెరిచాడు. అయితే బాక్సు తెరవగానే భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి బాక్సు తెరిచిన ఆ వ్యక్తి చేతులు తెగిపడ్డాయి. తీవ్ర గాయాలు కావడంతో అతడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మరణించాడు. రాజేంద్రనగర్‌ పోలీసు పరిధిలోని శివరాంపల్లి వద్ద ఈ ఘటన జరిగింది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని ఏం జరిగిందన్న దానిపై విచారణ చేపట్టారు. అయితే ఆ డబ్బా చెత్తకుప్పల్లో ఏరుకొని తెచ్చిన కెమికల్‌ డబ్బాగా పోలీసులు అనుమానిస్తున్నారు. భారీ శబ్దంతో పేలుడు సంభవిచండంతో చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. మృతుడు రాజేంద్రనగర్‌కు చెందిన యాచకుడు అలీగా గుర్తించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ.. పేలుడు ఘటనపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. బాంబు బ్లాస్ట్‌ కాదని, కెమికల్‌ బ్లాస్ట్‌ అని తెలిపారు. వేరే ప్రాంతం నుంచి ఆ బాక్సును యాచకుడు అలీ తీసుకు వచ్చినట్లు తెలిపారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

 

Similar News