అమరావతిలో ‘డ్రోన్ రగడ’

Update: 2019-08-16 08:44 GMT

అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య అమరావతిలో శుక్రవారం నాడు ‘డ్రోన్ రగడ’ నడిచింది. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడి నివాసం ఉన్న కరకట్ట ప్రాంతంలో డ్రోన్లతో షూటింగ్ జరపటం ఈ వివాదానికి కారణం అయింది. ఈ వ్యవహారంపై చంద్రబాబునాయుడు కూడా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాదు..దీనిపై ఏకంగా డీజీపీకి ఫోన్ చేసి ఎవరి అనుమతితో డ్రోన్లు షూటింగ్ చేశాయి..ఎవరికి సమాచారం ఇస్తున్నారు..దీని వెనక కుట్ర ఏంటి అంటూ ప్రశ్నించినట్లు వార్తలు వచ్చాయి. డ్రోన్ల వ్యవహారాన్ని టీడీపీ రాజకీయం చేయటంతో సర్కారు కూడా వెంటనే రంగంలోకి దిగింది. వరద పరిస్థితిని మదింపు చేయటానికి తామే డ్రోన్ల షూటింగ్ కు అనుమతించామని సాగునీటి శాఖ ప్రకటన విడుదల చేసింది.

ఆ తర్వాత మంత్రి అనిల్ కుమార్ కూడా ఇదే విషయాన్ని తెలిపారు. అయితే టీడీపీ నేతలు..శ్రేణులు మాత్రం కరకట్ట నివాసం వద్ద ఆందోళనకు దిగటంతోపాటు..డ్రోన్ తో షూటింగ్ చేసిన వారిని అడ్డుకుంది. వారు ఎవరో..ఎవరి ఆదేశాలతో డ్రోన్లు ఉపయోగించారో తేలితే తప్ప తాము వాళ్ళను బయటకు పోనివ్వమని అడ్డం పడ్డారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరకు పోలీసులు టీడీపీ శ్రేణులపై లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.

 

Similar News