అక్బరుద్దీన్ పై కేసు నమోదు

Update: 2019-08-02 15:21 GMT

కరీంనగర్ లో కొద్ది రోజుల క్రితం ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ చేసిన ప్రసంగం వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. అక్బరుద్దీన్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే విమర్శలు రాగా..పోలీసు ఉన్నతాధికారులు మాత్రం విచారణ జరిపి అలాంటిది ఏమీ లేదని తేల్చారు. తాజాగా కోర్టు ఆదేశాలతో ఆయనపై కేసు నమోదు అయింది. అక్బరుద్దీన్ ఒవైసీపై కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయింది. కోర్టు ఆదేశాలతో ఆయనపై సీఆర్‌పీసీ 153ఏ, 153బీ, 506, 156(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కరీంనగర్‌ సీఐ విజయ్ కుమార్ వెల్లడించారు. జూలై 24న కరీంనగర్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఒవైసీ మాట్లాడుతూ.. వివాదాస్పద రీతిలో వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఆయనపై కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు పలువురు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అయితే అక్బరుద్దీన్ ప్రసంగం రెచ్చగొట్టేలా లేదని వారం రోజుల క్రితం నగర సీపీ కమలాసన్‌ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చారు. సీపీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. బీజేపీ నగర అధ్యక్షుడు, న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఒవైసీ వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని ఆయన కోర్టును కోరారు. దీంతో ఆయన పిటిషన్‌ను పరిశీలించిన కరీంనగర్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సాయిసుధ ఘటనపై విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు. కోర్టు ఆదేశంతో క్రైమ్ నంబర్ 182/2019 ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

 

 

Similar News