అమరావతి రైతులకు 187 కోట్లు

Update: 2019-08-27 13:21 GMT

అసలు అమరావతిలో రాజధాని ఉంటుందా..ఉండదా?.శాశ్వత భవనాలు అక్కడ కడతారా..కట్టరా?. రాజధానికి భూములు ఇఛ్చిన రైతుల్లో నెలకొన్న అనుమానాలు ఇవి. అమరావతిలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే నిర్మాణ వ్యయం చాలా ఎక్కువ అని..శివరామకృష్ణ కమిటీ నివేదికను చంద్రబాబు సర్కారు తుంగలో తొక్కిందని ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన అమరావతిలో పెద్ద కలకలమే రేపింది. బొత్స ప్రకటనతో రాజధాని తరలిపోతుందనే వార్తలు జోరందుకున్నాయి. ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఇప్పటివరకూ క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ రాజధానికి భూములిచ్చిన రైతులకు మాత్రం చెల్లించాల్సిన కౌలు మొత్తం 187. 44 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. దీంతో రైతులకు ఊరట లభించినట్లు అయింది.

2019-20 ఆర్థిక సంవత్సరానికి రైతులకు కౌలు క్రింద ఈ మొత్తం విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా అమరావతి కేంద్రంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. బిజెపి కూడా సర్కారుపైనే విమర్శలు చేస్తోంది. మరో వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 30,31 తేదీల్లో అమరావతి ప్రాంతంలో పర్యటిస్తానని ప్రకటించారు. త్వరలోనే సీఎం జగన్ అమరావతిపై సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. మరి ఆ సమావేశంలో అయినా రాజధానిపై క్లారిటీ వస్తుందా..రాదా అన్న సంగతిపై సస్పెన్స్ నెలకొంది. అధికార వైసీపీ మాత్రం ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా అమరావతి పేరుతో టీడీపీ నేతలు భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపిస్తోంది.

 

 

Similar News