విజయసాయిరెడ్డి నియామకం రద్దు

Update: 2019-07-04 14:10 GMT

ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయిరెడ్డిని నియమిస్తూ సర్కారు గతంలో జారీ చేసిన జీవోను రద్దు చేసింది. ఈ మేరకు గురువారం నాడు జీవో ఎంఎస్ 74 జారీ చేసింది. విజయసాయిరెడ్డిని ఈ పదవిలో నియమిస్తూ జూన్ 22న జీవో 68 జారీ చేశారు. ఓ వైపు రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ మరో వైపు లాభదాయక పదవి (ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్) కింద మరో పదవి చేపట్టడం నిబంధనలకు వ్యతిరేకం అనే విషయాన్ని తొలుత తెలుగుగేట్ వే. కామ్ మాత్రమే వెలుగులోకి తెచ్చింది.

కానీ కొంత మంది మీడియా ప్రతినిధులు అప్పట్లోనే విజయసాయిరెడ్డిని ఈ అంశంపై సంప్రదించగా ఎలాంటి వేతనం లేకుండా పనిచేస్తానని ప్రకటించారు. తీరా ఇఫ్పుడు సర్కారు నిబంధనలు తెలుసుకుని ఈ జీవోను ఉపసంహరించుకుంది. ప్రభుత్వంలో ఎంతో మంది ఉన్నతాధికారులు, సలహాదారులు ఉండి ఇంతటి కీలక విషయంలో తప్పు చేయటం ప్రభుత్వానికి అప్రతిష్ట అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పుడు విజయసాయిరెడ్డి స్థానంలో మరొకరిని ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా నియమించే అవకాశం ఉంది.

 

Similar News