తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో ముఖ్యమంత్రి కెసీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. మీ ఎమ్మెల్యేలను మీరు కాపాడుకోలేకపోయారని..మీ దగ్గర వారిని ఆకర్షించే శక్తిలేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. తాము ఫిరాయింపులను ఏ మాత్రం ప్రోత్సహించలేదని..పార్టీలో చీలిక వచ్చింది కాబట్టే తాము టీఆర్ఎస్ లో విలీనానికి అనుమతించామని తెలిపారు. అంతకు ముందు కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. ఈ అంశంపై మాట్లాడిన సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కొత్త రాష్ట్రం తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉండాలి కానీ..ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని విమర్శించారు. ఒక పార్టీ టిక్కెట్ పై గెలిచిన వారిని మరో పార్టీలో చేర్చుకోవటం ఏ మాత్రం సరికాదన్నారు. పలు బిల్లులకు ఆమోదం తెలిపేందుకు గురు, శుక్రవారాల్లో ప్రభుత్వం శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ సభ్యుల నిరసనలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పందించారు.
టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ ఎల్పీ విలీనం రాజ్యాంగబద్ధంగా జరిగిందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమైన విషయాన్ని, గోవాలో కాంగ్రెస్ సభ్యులు బీజేపీలో విలీనమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారితే తమని నిందించడం సరికాదని అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడిందని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో రైతులకు ఉచితంగానే కరెంట్ ఇస్తాం. ఎన్నివేల కోట్లు ఖర్చయినా కరెంట్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది అని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ బౌగౌళిక పరిస్థితి ప్రకారం ఇక్కడ లిఫ్ట్ లు తప్ప మరో ప్రాజెక్టుల సాధ్యంకాదనే విషయం గుర్తించాలన్నారు. చాలా మంది విషయం తెలియక ఏదేదో మాట్లాడుతున్నారని.తాము తెలంగాణ ప్రజలకు తప్ప ఎవరికీ జవాబుదారీ కాదని వ్యాఖ్యానించారు.