అప్పుడు చంద్రన్న...ఇప్పుడు జగనన్న పథకాలు

Update: 2019-07-12 07:59 GMT

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట. అధికారంలోకి వచ్చాక మరో మాట. ఇందుకు వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఏ మాత్రం మినహాయింపు కాదని నిరూపించుకున్నారు. గతంలో చంద్రబాబునాయుడు తన హయంలో ప్రతి స్కీమ్ కు చందన్న అది..చంద్రన్న ఇది అంటూ పలు ప్రభుత్వ పథకాలకు చంద్రబాబు పేర్లు పెట్టారు. దీనిపై వైసీపీ అప్పట్లో తీవ్ర విమర్శలు చేసింది. చంద్రన్న పేరుతో ప్రచారం చేసుకోవటానికి ఇవేమీ ఏమైనా హెరిటేజ్ డబ్బుల నుంచి ఇస్తున్నారా?. లేక చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడి తండ్రి ఆస్తుల నుంచి ఇస్తున్నారా? అంటూ వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. సీన్ కట్ చేస్తే జగన్ సీఎం అయిన 45 రోజులకే ఏకంగా ఆయన పేరుతో ఇప్పుడు ఓ పథకం వచ్చేసింది. దాదాపు ఆరు సంతవ్సరాలకుపైగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజశేఖర్ రెడ్డి లాంటి సీనియర్ నేత కూడా ప్రభుత్వ పథకాలను తన పేరు పెట్టుకునే సాహసం చేయలేదు. కానీ ఏపీ సర్కారు అప్పుడే ఏకంగా జగన్ పేరును ఓ పథకానికి పెట్టడం విశేషం.

ఏపీ ప్రభుత్వం ఎంతో ఫోకస్ పెట్టిన అమ్మ ఒడి పథకానికి జగనన్న అమ్మ ఒడి పథకం అని పేరు పెట్టారు. జగన్ తన పేరు పెట్టడానికి ఒప్పుకోలేదని..అయినా తామంతా బలవంతం చేసి దీనికి ఒప్పించామని ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. ఏ ప్రభుత్వం అయినా మంచి పనులు చేస్తే ఆ క్రెడిట్ సహజంగా ముఖ్యమంత్రికే వస్తుంది. కానీ ఓ పథకానికి ముఖ్యమంత్రి పేరు పెట్టడం వల్ల ఉపయోగం ఏమి ఉంటుంది. మరి గతంలో చందన్న పేరుతో ఏర్పాటు చేసిన పథకాలపై విమర్శలు చేసిన వైసీపీ మరి ఇఫ్పుడు జగనన్న పేరు ఎలా సమర్ధించుకుంటుంది?. వైసీపీ నేతల గత విమర్శలు లెక్క ప్రకారం మరి జగనన్న అమ్మ ఒడి పథకానికి జగన్ తన సొంత నిధులు సమకూరుస్తారా?

 

Similar News