జగన్ సంచలన నిర్ణయం

Update: 2019-07-10 08:10 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2014-19 సంవత్సరాల మధ్య కాలంలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రైతు కుటుంబాలకు ఏడు లక్షల రూపాయల నష్టపరిహారం అందజేయాలని నిర్ణయించారు. కలెక్టర్లు..ఎమ్మెల్యేలతో కలసి స్వయంగా వెళ్ళి ఈ సాయం అందించాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు..ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సమయంలో జగన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో 1513 మంది రైతులు చనిపోతే..అందులో కేవలం 391 మందికి మాత్రమే సాయం చేశారని తెలిపారు. మిగిలిన రైతులకు కూడా కుటుంబానికి ఏడు లక్షల రూపాయల లెక్కన సాయం అందజేయాలని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్లు తమ తమ జిల్లాలోని లెక్కలను ఓ సారి సరిచూసుకుని ఈ సాయం అందించాలని సూచించారు. గత ప్రభుత్వం కొంత మందికే సాయం చేసి..మిగిలిన వారిని వదిలేసిందని అన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు అయిన రైతే చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి ఎవరు అండగా ఉంటారు..ఖచ్చితంగా ప్రభుత్వం తరపున ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని జగన్ వ్యాఖ్యానించారు. జగన్ తాజా నిర్ణయంతో ఏపీలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు సుమారు వంద కోట్ల రూపాయల మేర సాయం అందనుంది. రైతులు..కౌలు రైతులకు ఏ కష్టం వచ్చినా కలెక్టర్లు వెంటనే స్పందించాలని జగన్ ఆదేశించారు.

 

 

 

 

Similar News