భూమన సంచలన వ్యాఖ్యలు

Update: 2019-06-06 13:23 GMT

తిరుపతి ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో రెండు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరగనుండగా ఆయన మంత్రి పదవికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవిపై ఎలాంటి ఆశల్లేవన్నారు. అదే సమయంలో తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ప్రశ్నేలేదని వ్యాఖ్యానించటం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఎమ్మెల్యేగా ఎన్నికై..వచ్చే ఎన్నికల్లో పోటీచేయనని ఇప్పుడు ప్రకటించాల్సిన అవసరం ఏముందనే చర్చ మొదలైంది.

తిరుమల శ్రీవారికి ప్రతినిధిగా ఉండటమే చాలా గొప్ప గౌరవం అని వ్యాఖ్యానించారు. తాను వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యుడిని అని..అంత కంటే తనకు ఇంకేమి గౌరవం కావాలన్నారు. తిరుపతి టీడీపీకి ఎంతో బలమైన సీటు అని..ఇక్కడ గెలవటం ఆషామాషీకాదన్నారు. ప్రతి క్షణమూ తాను తిరుపతి అభివృద్ధి కోసమే కృషి చేస్తానని పేర్కొన్నారు. తిరుపతిలో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 

Similar News