వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న జగన్

Update: 2019-05-29 03:49 GMT

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించటానికి ముందు వైసీపీ అధినేత , ఆ పార్టీ శాసనసభాపక్ష నేత జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. గురువారం 12.23 గంటలకు ఏపీ రెండవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం ఉదయమే తిరుమల ఆలయానికి వచ్చిన వైఎస్‌ జగన్‌కు ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ మార్గం ద్వారా వైఎస్‌ జగన్‌ ఏడుకొండలపై కొలువై ఉన్న కలియుగ వైకుంఠనాథుడిని దర్శించారు. ఆలయంలో శ్రీవారి సేవలో గడిపిన వైఎస్‌ జగన్‌కు రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించారు.

శాలువాతో సత్కరించి.. శ్రీవారి చిత్రాన్ని ఆయనకు అందించారు. ఈ సందర్భంగా జగన్ తో విజయసాయిరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితర నేతలు, పార్టీ ఎమ్మెల్యేలు పలువురు ఉన్నారు. మంగళవారం సాయంత్రమే ప్రత్యేక విమానంలో వైఎస్‌ జగన్‌ రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకొని.. అక్కడి నుంచి తిరుమల కొండ మీదకు వచ్చిన సంగతి తెలిసిందే.

 

Similar News